Virat Kohli: భారత క్రికెట్‌లో ఒకే ఒక్కడు.. 50+ స్కోర్లలో కోహ్లీ ‘సెంచరీ’

పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు.

Updated : 26 Mar 2024 12:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోని విరాట్‌ కోహ్లీ(Virat Kohli).. రెండో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఈ పరుగుల వీరుడు అరుదైన ఘనత సాధించాడు. 

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఛేజ్‌ మాస్టర్‌ 49 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్స్‌లతో చెలరేగి 77 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో వంద సార్లు 50+ స్కోరు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇందులో ఎనిమిది శతకాలు ఉన్నాయి. 110 సార్లు ఈ ఘనత సాధించి యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత డేవిడ్‌ వార్నర్‌(109) నిలిచాడు. మూడో స్థానంలో కోహ్లీ కొనసాగుతున్నాడు. 377 ఇన్నింగ్స్‌లో విరాట్‌ ఈ మైలు రాయిని చేరుకోవడం విశేషం.

కోహ్లీకి ఈ సీజన్‌లో తొలి అర్ధశతకం ఇది. 31 బంతుల్లోనే దీనిని సాధించాడు. మరోవైపు టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. నిన్నటి మ్యాచ్‌లో బెయిర్‌స్టో క్యాచ్‌ పట్టడంతో మొత్తం 173తో ఈ జాబితాలో సురేశ్‌ రైనా(172)ను వెనక్కి నెట్టి తొలి స్థానానికి చేరాడు. ఆ తర్వాత స్థానాల్లో రోహిత్‌ శర్మ(167), మనీశ్‌ పాండే(146) ఉన్నారు. రెండు మ్యాచ్‌లు ఆడి ఒక విజయాన్ని నమోదు చేసిన బెంగళూరు.. తన తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని