Virat Kohli @ 15: రికార్డులను తిరగరాస్తూ.. మైదానాన్ని ఏలుతున్న ‘కింగ్‌’

రికార్డుల రారాజు సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar) స్థాయిని అందుకొనే ఆటగాళ్లు ఎవరైనా వస్తారా..?  అని సగటు క్రికెట్ అభిమాని మీమాంసలో ఉన్నప్పుడు నేను ఉన్నానంటూ ముందుకొచ్చాడు. ఆ దిశగా కొన్ని రికార్డులను కూడా ఒడిసిపట్టాడు. కింగ్ కోహ్లీగా గుర్తింపు సాధించిన విరాట్ (Virat Kohli) అంతర్జాతీయ కెరీర్ మొదలై నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తి కావడం విశేషం.

Updated : 18 Aug 2023 15:13 IST

బంతితో ప్రశ్న వేస్తే బ్యాటుతో సమాధానం ఇస్తాడు. ఆటలో కవ్విస్తే... మైదానంలో కళ్లు బైర్లు కమ్మేలా ఆన్సర్‌ ఇస్తాడు. ఒక్కసారి నమ్మాడా... ఎంత దూరమైనా వస్తాడు. ఇవన్నీ విరాట్‌ కోహ్లీకి సరిగ్గా నప్పుతాయి అంటుంటారు సన్నిహితులు. 15 ఏళ్ల క్రితం ఒక సాధారణ క్రికెటర్‌గా టీమ్‌ ఇండియాలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు విరాట్‌ని చూస్తే వాళ్ల మాట కరెక్ట్‌ అనిపించకమానదు. కోహ్లీగా వచ్చి కింగ్‌ కోహ్లీగా మారిన విరాట్‌ గురించి ఈ స్పెషల్‌ డే నాడు కొన్ని ముచ్చట్లు మీ కోసం!

ఒక్కసారి మ్యాచ్‌ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీని గమనిస్తే ఇప్పటి వరకు ఇతడితోనేనా మనం తలపడిందని ప్రత్యర్థి క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోతుంటారు. దానికి కారణం కూడా ఉందండోయ్.. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఒక వేళ తాను ప్రాతినిధ్యం వహించే జట్టు ఓడిపోయినా సరే.. అప్పటి వరకు సీరియస్‌గా ఉండే విరాట్ కోహ్లీ తన దగ్గరకు వచ్చే ప్రత్యర్థి యువ ఆటగాళ్లకు క్రికెట్ పాఠాలు కూడా చెబుతాడు. ఆ రోజు అద్భుత ప్రదర్శన ఇచ్చిన క్రికెటర్‌ను అభినందిస్తాడు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ఎలా రాణించాలని తన మాటలతో స్ఫూర్తి నింపుతాడు. ఇలాంటి అత్యుత్తమ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన 15 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌ను పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో ఇప్పుడు #15YearsOfViratKohli ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

నాంది పడిందక్కడే.. 

అప్పుడు విరాట్ వయసు 16 ఏళ్లు. ఓ వైపు తండ్రి చనిపోయిన వార్త.. మరోవైపు కెరీర్‌కు కీలకమైన మ్యాచ్‌.. అంత బాధలోనూ 90 పరుగులు చేసి తన దిల్లీ జట్టును రక్షించాడు. ఆ వెంటనే తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఇదంతా 2006 నాటి సంఘటన. ఆ తర్వాత రెండేళ్లకే జరిగిన అండర్ -19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ను విరాట్ కోహ్లీ విజేతగా నిలిపాడు. కొన్ని నెలలకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టడం విశేషం. ఆ వరల్డ్‌ కప్‌లో కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా నడపడటంతోపాటు బ్యాటర్‌గానూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆరు మ్యాచుల్లో 47 సగటుతో 235 పరుగులు సాధించాడు. ఇందులో విండీస్‌పై సెంచరీ కూడా ఉంది.

బిజినెస్‌ క్లాస్‌లో తొలిసారి ప్రయాణం.. రింకు సింగ్‌ రియాక్షన్‌ ఏంటంటే?

దీంతో భారత్‌ తరఫున జాతీయ జట్టులోకి వచ్చేశాడు.  ఇప్పుడంటే భారత్‌ తరఫున అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్న కోహ్లీ.. కెరీర్‌ ఆరంభంలో అతడి గణాంకాలు గొప్పగా ఏమీ లేవు. తొలుత వన్డేల్లోకి అరంగేట్రం చేసిన విరాట్ తొలి అర్ధశతకం చేయడానికి ఐదు మ్యాచ్‌లను తీసుకోవడం గమనార్హం. కెరీర్‌లో మొదటి సెంచరీ (107) కూడా శ్రీలంకపైనే చేశాడు. 2011లో టెస్టుల్లోకి, 2010లో టీ20ల్లోకి అడుగు పెట్టిన విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ వందకు పైగా మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా అవతరించాడు. ఇప్పటి వరకు 111 టెస్టులు, 275 వన్డేలు, 115 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 

సచిన్‌నే కాదు.. అతడి బాధ్యతలనూ మోస్తాం

విరాట్ కెరీర్‌లో 2010 నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ ఏడాది మూడు వన్డే సెంచరీలు బాదిన కోహ్లీ.. రాటుదేలుతూ వచ్చాడు. భారత్ గెలిచిన 2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లోనూ కీలక పరుగులు సాధించాడు. భారత్ విజయం సాధించడంలో అతడూ పాత్ర పోషించాడు. సచిన్‌ తెందూల్కర్‌కు చివరి వరల్డ్‌ కప్‌ను అంకితమిచ్చిన భారత జట్టు ఆటగాళ్లు అతడిని తమ భుజాలపై స్టేడియమంతా కలియతిప్పారు. ఒక ఇంటర్వ్యూలో ఆ సంఘటనపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ‘‘దాదాపు 21 ఏళ్ల నుంచి జాతీయ జట్టు బరువును సచిన్‌ మోశాడు. ఇక నుంచి మేం మోయాల్సిన సమయం వచ్చింది’’ అని వ్యాఖ్యానించాడు. అతడు చెప్పిన మాటలు అక్షర సత్యం.

సచిన్‌ రికార్డులను, ఘనతలతోపాటు ఆ స్థాయి ఆటతీరుకు ఎవరూ చేరుకోలేరేమోనని అంతా భావించిన వేళ.. నేను ఉన్నానంటూ విరాట్ కోహ్లీ ముందుకొచ్చాడు. తన అద్భుతమైన ఆటతీరుతో ఆ దిశగా సాగాడు. సచిన్‌ తెందూల్కర్‌ మాదిరిగా 24ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌ ఉంటే మాత్రం విరాట్ అన్ని రికార్డులను బద్దలు కొట్టేందుకు ఆస్కారం ఉంది. అయితే, ప్రస్తుతం 34 ఏళ్ల విరాట్ కోహ్లీ మహా అయితే మరో మూడు లేదా నాలుగేళ్లు మాత్రమే కెరీర్‌ను కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ కొన్ని రికార్డుల్లో సచిన్‌ను విరాట్ అధిగమించే అవకాశాలు ఉన్నాయి. వన్డేల్లో సచిన్ 49 సెంచరీలు చేయగా.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 46తో కొనసాగుతున్నాడు. ఆసియా  కప్, వన్డే ప్రపంచకప్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తే సచిన్‌ను అధిగమించడం విరాట్‌కు కష్టం కాదు.  

స్వర్ణయుగం అంటే ఇదే..

విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉంటే ఎంత డేంజరస్‌ అనేది అతడి గణాంకాలను చూస్తే అర్థమైపోతుంది. కేవలం రెండు సంవత్సరాల్లోనే 22 సెంచరీలు బాదడం గమనార్హం. వరుసగా సెంచరీల మోత మోయించడం కూడా కష్టమే. అలాంటిది 2017, 2018 సీజన్లలో వరుసగా 11 సెంచరీలు చేసి అదరహో అనిపించాడు. కొందరు కెరీర్‌ మొత్తం ఆడినా ఇన్నేసి సెంచరీలు చేసి ఉండరేమో. కోహ్లీ 2017లో మొత్తం 42 మ్యాచుల్లో (అన్ని ఫార్మాట్లు) 11 సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అయితే, 2018 సంవత్సరంలో మాత్రం 38 మ్యాచుల్లోనే ఆ మార్క్‌ను తాకడం గమనార్హం. 

ఆ రెండున్నరేళ్లు కష్టకాలం.. 

విరాట్ కోహ్లీ హవా ఎలా కొనసాగిందంటే అతడు ఆడితే కనీసం హాఫ్ సెంచరీ అయినా చేయనిదే మైదానం విడిచిపెట్టి వెళ్లడని ప్రత్యర్థులు సైతం బెంబేలెత్తేవారు. క్రీజ్‌లో కుదురుకుంటే భారీ స్కోర్లుగా మలుస్తాడనే పేరుంది. అయితే, 2019 చివరి నుంచి గతేడాది ఆసియా కప్‌ వరకు దాదాపు రెండున్నరేళ్ల వ్యవధిలో కెరీర్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అర్ధశతకాలు సాధిస్తున్నప్పటికీ అతడి స్థాయి ఆటకు అవి సరిపోలేదు. ఎప్పుడైతే గత ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీతో ఒత్తిడిని దించేసుకున్నాడో.. ఆ తర్వాత నుంచి చెలరేగిపోయాడు. ఇటు టెస్టు, వన్డేల్లో ఇదే ఏడాది రెండేసి సెంచరీలు బాదేశాడు.

ప్రస్తుతం అద్భుమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించి జట్టును గెలిపించాలనేది అభిమానుల ఆకాంక్ష. కెరీర్‌లోని అన్ని ఫార్మాట్లలో 9వేల పరుగుల నుంచి ప్రస్తుతం 25వేలకుపైగా (25,582) పరుగుల వరకు 50 సగటుతో కొనసాగుతున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే కావడం విశేషం. మధ్యలో సగటు కాస్త దిగువకు వచ్చినా వెంటనే పుంజుకోవడం విరాట్ ప్రత్యేకత. 

కెప్టెన్సీలో చరిత్ర.. కానీ

ఆటగాడిగా తనదైన ముద్ర వేసిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనూ చరిత్ర సృష్టించాడు. విరాట్ సారథ్యం చేపట్టకముందు విదేశీ పర్యటనల్లో భారత్‌ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. అయితే, విరాట్ కోహ్లీ - ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి నేతృత్వంలో టీమ్‌ఇండియా బలమైన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లను వారి సొంతగడ్డపైనే ఓడించింది. అయితే, కెప్టెన్‌గా ఐసీసీ ట్రోఫీలను నెగ్గలేదనే అపవాదు మాత్రం వెన్నాడుతోంది. అదే సమయంలో ఐపీఎల్‌లోనూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టును కూడా విజేతగా నిలపలేకపోయాడు. అలాగే 2011లో వరల్డ్‌ కప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్ కోహ్లీ.. 2019 ప్రపంచకప్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, సెమీస్‌కు మాత్రమే చేరిన విరాట్ సేన అక్కడితో కప్‌ ఆశలను చేజార్చుకుంది.

ఆ తర్వాత 2021 టీ20 ప్రపంచకప్‌లోనూ విఫలం కావడంతో కెప్టెన్సీని వదిలిపెట్టేశాడు. అంతకుముందు ఆసియా కప్‌లోనూ భారత్ సత్ఫలితాలను సాధించలేకపోయింది. కెప్టెన్‌గా మిశ్రమ ఫలితాలను సాధించిన విరాట్.. యువ క్రికెటర్లను ప్రోత్సహంచడంలో మాత్రం ముందున్నాడు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి మద్దతుగా నిలిచేవాడు. ఇందుకు సిరాజ్‌ ప్రత్యక్ష ఉదాహరణ. సిరాజ్  కెరీర్‌ ఆరంభంలో భారీగా పరుగులు సమర్పించినా.. పక్కన పెట్టుకుండా జట్టులో స్థానం కల్పించడం వల్లే ఇప్పుడు భారత్‌కు ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు.  

ఫిట్‌నెస్‌లో తిరుగులేదు.. 

క్రికెటర్‌గా మైదానంలో చాలా చురుగ్గా ఉండాలి. దాని కోసం ఎప్పుడూ ఫిట్‌గా ఉంటేనే అనుకున్న ఫలితాలను సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. గాయాలబారిన పడే అవకాశాలూ చాలా తక్కువగా ఉంటాయి. చాలా మంది క్రికెటర్లు అద్భుతమైన టాలెంట్‌ ఉన్నా ఫిట్‌నెస్‌ సమస్యలతో కెరీర్‌ను మధ్యలోనే ముగించాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ, విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఎప్పటికీ అలా జరగదని గట్టిగా చెప్పడానికి కారణం అతడి ఫిట్‌నెస్ స్థాయి. గత ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా జాతీయ క్రికెట్‌ అకాడమీకి వెళ్లలేదంటే ఫిట్‌నెస్, ఆరోగ్యం విషయంలో విరాట్ కోహ్లీ తీసుకునే జాగ్రత్తలు ఏంటో తెలిసిపోతుంది. కచ్చితమైన డైట్‌ను పాటించడంలోనూ కోహ్లీని మించిన వారుండరేమో. ఇటీవల తరచూ సోషల్ మీడియా వేదికగా జిమ్‌లో గడుపుతున్న ఫొటోలను చూస్తూనే ఉన్నాం కదా. గాయాలు, ఫిట్‌నెస్‌ కారణంగా అతడు జట్టుకు దూరమైన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇప్పటి వరకు మైదానంలో అతడు పరుగెత్తిన దూరం దాదాపు 500 కి.మీపైగా ఉంటుందనేది పలు వార్తా కథనాల ప్రకారం తెలుస్తోంది. ఇందులోనే వికెట్ల మధ్య దాదాపు 277 కి.మీలు రన్‌ చేశాడట.

స్నేహమంటే విరాట్‌దేరా..

పైన చెప్పినట్లుగా విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. వెలుపల అంత కూల్‌. కేవలం భారత జట్టులోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అతడికి స్నేహితులు చాలా మంది ఉన్నారు. కేన్‌ విలియమ్సన్‌తో అండర్ -19 నుంచి  ఉన్న పరిచయం.. ఇద్దరూ స్టార్లుగా మారినప్పటికీ కొనసాగుతుండటం విశేషం. ఐపీఎల్‌ సందర్భంగా ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌ గేల్‌తో కుదిరిన స్నేహం ఎంతో ప్రత్యేకమైంది. ప్రత్యర్థి జట్టు ఆటగాడైనప్పటికీ వారి ఆటను ఆస్వాదిస్తానని వెల్లడించడం విరాట్ కోహ్లీకే చెల్లుతుందేమో.

పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ను తొలిసారి కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు వారి మధ్య గౌరవభావం కొనసాగుతోంది. ఎంఎస్ ధోనీకి కేవలం సహచరుడిగానే కాకుండా సోదరుడిగా, స్నేహితుడిగా తన మదిలో ప్రత్యేక స్థానం ఉందంటాడు విరాట్. తాను ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న సమయంలోనూ, కెప్టెన్సీ కోల్పోయినప్పుడు మానసికంగా ఎవరూ మద్దతుగా లేరని.. అప్పుడు ధోనీ మాత్రమే సందేశం పంపించాడని విరాట్ ఓ ఇంటర్వ్యలో వెల్లడించిన సంగతి తెలిసిందే. 

ప్రేమ.. పెళ్లి.. సంపాదన..

విరాట్ కోహ్లీ విజయవంతమైన క్రికెటర్‌గా మారడంలో అతడి తండ్రి కీలక పాత్ర పోషించాడు. అయితే, 16 ఏళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న విరాట్ కోహ్లీ.. వ్యక్తిత్వపరంగా ఎంతో పరిణతి చెందాడు. అందుకే, విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన ఐదేళ్లకే (2013లో) ‘విరాట్ కోహ్లీ ఫౌండేషన్’ ప్రారంభించి సేవలు అందిస్తుండటం విశేషం. బాలీవుడ్ నటి అనుష్క శర్మతో నాలుగేళ్లపాటు ప్రేమలో ఉన్న విరాట్ 2017లో జంటగా మారారు. వీరిద్దరికి 2021 జనవరి 11న ‘వామికా’ జన్మించింది. ఇటీవలే విరాట్ కోహ్లీకి సంబంధించి అతడి ఆస్తి విలువ రూ. 1000 కోట్లకుపైగా ఉంటుందనే వార్తలు వచ్చాయి. అలాగే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లను వసూలు చేస్తాడనే వార్తలను ఇటీవల కోహ్లీ కొట్టిపడేసిన సంగతి తెలిసిందే.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని