IND vs ENG: కుర్రాళ్ల పట్టుదల అద్భుతం.. టీమ్‌ఇండియాకు కోహ్లీ ప్రశంసలు

స్వదేశంలో భారత్‌ మరో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌ను నాలుగో టెస్టులో చిత్తు చేసింది.

Updated : 26 Feb 2024 16:58 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌ మిగిలిఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. రాంచీ మైదానం వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో పర్యటక జట్టుపై టీమ్‌ఇండియా విజయం సాధించింది. 192 పరుగులను ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ బౌలర్లు ఇబ్బందిపెట్టినా భారత బ్యాటర్లు నిలకడగా ఆడి గెలిపించారు. ఈసందర్భంగా టీమ్‌ఇండియా సిరీస్‌ విజయంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘‘మన యంగ్‌ టీమ్‌ అద్భుతం చేసింది. సిరీస్‌ను కైవసం చేసుకుంది. పట్టుదల, సంకల్పం, కఠిన పరిస్థితులను ఎదుర్కొనే దృఢత్వాన్ని కుర్రాళ్లు ప్రదర్శించారు’’ అని కోహ్లీ పోస్టు పెట్టాడు. 

సునీల్ గావస్కర్ ‘మరో ధోనీ’ వ్యాఖ్యలపై స్పందించిన ధ్రువ్‌

నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా విజయం సాధించడానికి ధ్రువ్ జురెల్ ఆడిన ఇన్నింగ్స్‌లూ కారణమే. తొలి ఇన్నింగ్స్‌లో 90, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 39 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈసందర్భంగా ఇటీవల తనను ధోనీతో పోలుస్తూ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలపై ధ్రువ్ స్పందించాడు. ‘‘క్రికెట్ స్టార్‌ గవాస్కర్‌ నన్ను అలా ప్రశంసించడం ఆనందంగానే ఉంది. అయితే మ్యాచ్‌ సమయంలో నాకు ఇలా ఆడు.. అలా ఆడు అని ఎవరూ ప్రత్యేకంగా సూచించలేదు. సహజసిద్ధమైన ఆటతీరును ప్రదర్శించా. బంతిని నిశితంగా గమనించి ఎదుర్కొన్నా. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్‌ కావడంపై నాకేమీ బాధ లేదు. ఇదే నా మొదటి సిరీస్‌. నా చేతుల మీదుగా ట్రోఫీని ఎత్తుకొనేందుకు తహతహలాడుతున్నా. టెస్టుల్లో భారత్‌ తరఫున ఆడాలనేది చిన్నప్పటినుంచి కల. ఇప్పుడు నెరవేరడం సంతోషంగా అనిపిస్తోంది’’ అని ధ్రువ్ తెలిపాడు. 

రోహిత్-అండర్సన్‌ మధ్య మాటలు.. సరైంది కాదన్న రవిశాస్త్రి

(ఫొటో సోర్స్‌: ఎక్స్‌)

నాలుగో టెస్టులో భారత్ లక్ష్య ఛేదన సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ - ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ పరస్పరం ఏవో మాటలు అనుకున్నారు. తన బౌలింగ్‌లో హిట్‌మ్యాన్‌ భారీ సిక్స్‌ కొట్టాడు. తర్వాత బంతికి సింగిల్‌ కోసం ప్రయత్నించి రనౌట్‌ ప్రమాదం నుంచి రోహిత్ బయటపడ్డాడు. అప్పుడే అండర్సన్‌ తన నోటికి పని చెప్పడం లైవ్‌లో కనిపించింది. అనూహ్య పరిణామంతో రోహిత్ కాస్త షాక్‌కు గురయ్యాడు. అయితే, ఒక్క క్షణమే అలా జరిగిపోయింది. ఆ ఘటనపై భారత మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘రోహిత్ తన ఎండ్‌ వైపు వెళ్లిన తర్వాత అండర్సన్‌ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అనూహ్య పరిణామంతో రోహిత్ మాత్రం ఇబ్బందికరంగా నవ్వుతూనే స్పందించాడు. అయితే, ఈ ఘటన చూసేందుకు బాగోలేదు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి ప్రయోజనం పొందేందుకు కొందరు ఇలా చేస్తుంటారు’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు