Gambhir - India Head Coach: జట్టులో దూకుడు తెస్తాడు.. గంభీర్‌ బెస్ట్‌ ఆప్షన్‌: వసీమ్ అక్రమ్

గంభీర్‌ మార్గదర్శకంలో కోల్‌కతా ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో వసీమ్‌ అక్రమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Updated : 22 May 2024 09:58 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాన కోచ్‌ పదవి కోసం గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) అత్యుత్తమ ఎంపికని పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్‌ వ్యాఖ్యానించాడు. టోర్నీకి ముందు.. ఎలాంటి ఆశలు లేని సమయంలో కోల్‌కతాను ఐపీఎల్ 17వ సీజన్‌ ఫైనల్‌కు చేర్చడంలో మెంటార్‌గా గంభీర్‌ కీలక పాత్ర పోషించాడని అభివర్ణించాడు. రాహుల్‌ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం జూన్ చివరితో ముగుస్తుంది. టీ20 ప్రపంచ కప్‌ తర్వాత కొత్త కోచ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.  స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్, లాంగర్, జయవర్థెనె పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, గంభీర్‌ వైపే పాక్‌ మాజీ మొగ్గు చూపాడు.

‘‘గంభీర్‌ అత్యుత్తమ అభ్యర్థి అని ఎందుకు చెబుతున్నానంటే.. సూటిగా ఉంటాడు. అతడిని అర్థం చేసుకోవడం కష్టమేం కాదు. సాధారణంగా ఉండే వ్యక్తి. అయితే, అతడు దీని కోసం అంగీకరిస్తాడా? లేదా? అనేది కీలకం. క్రికెట్‌ కోసం ఇప్పటికే రాజకీయాలను కూడా పక్కన పెట్టేశాడు. కాబట్టి, అతడికి తగినంత సమయం ఉంది. ఎందుకంటే భారత క్రికెట్ కోచ్‌గా ఎక్కువ టైమ్‌ వెచ్చించాల్సిన అవసరం ఉంది. అతడికి ఇద్దరు కుమార్తెలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఏదైనా విషయాన్ని స్పష్టంగా వెల్లడించే తెలివైన వ్యక్తి. దేని గురించీ రెండు రకాల మాటలు చెప్పడు. ఎక్కడ పొరపాటు జరిగినా మొహం మీదే చెప్పేస్తాడు. అలాంటి లక్షణాలు ఉండటం వల్లే అతడిని అభిమానించేవారూ ఎక్కువే. చాలాసార్లు గంభీర్‌ మాటల్లో దూకుడు కనిపిస్తోంది. ఒకవేళ టీమ్‌ఇండియా కోచ్‌గా వస్తే జట్టులోకి దానిని తీసుకొస్తాడనంలో సందేహం లేదు’’ అని అక్రమ్‌ స్పష్టం చేశాడు.

మనం అక్కడ ఉండాల్సిందే: గంభీర్‌ వీడియో వైరల్

హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు కోల్‌కతా ఆటగాళ్లను ఉద్దేశించి గంభీర్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘జట్టులోని ప్రతి ఒక్కరినీ సమానంగానే చూస్తాం. ఇందులో సీనియర్‌-జూనియర్‌ అనే తేడా లేదు. అతడు అంతర్జాతీయ ప్లేయరా? దేశవాళీ ఆటగాడా? అనే ఊసే ఉండదు. మనమంతా ఒకే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలవాలనేది మన టార్గెట్. ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను గుర్తెరిగి ఆడితే చాలు. మే 26న మనం చెన్నైలో అడుగు పెట్టాలి. ఇదేదో ఆ రోజున లేకపోతే మే 23న కాదు.. ఇప్పుడే మనం మొదలుపెట్టాలి’’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. అందుకు తగ్గట్టుగానే సన్‌రైజర్స్‌ను కేకేఆర్‌ చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని