Team India Fitness: ఎవరికి.. ఎప్పుడు.. ఏ గాయమవునో... టీమ్‌ఇండియాలో ఫిట్‌నెస్‌ ఓ మిథ్య!

టీమిండియా ఫిట్‌నెస్‌ (Team India Fitness) కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. NCCలో కోలుకుని, పూర్తి ఫిట్‌నెస్‌తో వచ్చారని చెబుతున్న క్రికెటర్లు (Team India Players) వెంటనే గాయంతో జట్టు నుంచి దూరమవుతున్నారు.

Updated : 13 Sep 2023 14:15 IST

జస్‌ప్రీత్‌ బుమ్రా, దీపక్‌ చాహర్, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ షమి, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌.. ఏమిటీ జాబితా అనుకుంటున్నారా? గత ఏడాది వ్యవధిలో గాయాలతో ఇబ్బంది పడ్డ టీమ్‌ఇండియా ఆటగాళ్లు వీళ్లు. క్రికెటర్లన్నాక గాయాలు సహజమే కావచ్చు.. ఒక ఆటగాడు మళ్లీ మళ్లీ గాయపడటం.. పూర్తి ఫిట్‌నెస్‌ (Fitness) సాధించాడు అనుకునేలోపే మళ్లీ గాయాలు తిరగబెట్టడం.. ఎప్పుడు ఏ ఆటగాడు మ్యాచ్‌కు దూరం అవుతాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుండటం ఆందోళన కలిగించే విషయం. తాజాగా ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడాడో లేదో అంతలోనే శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) గాయపడటం చర్చనీయాంశంగా మారింది.

కొన్ని వారాల కిందటి మాట. ఆసియా కప్‌ (Asia Cup 2023) సమీపిస్తుండగా.. ప్రపంచకప్‌ జట్టు ఎంపికకూ సమయం దగ్గర పడుతుండగా.. కేఎల్‌ రాహుల్ (KL Rahul), శ్రేయస్‌ అయ్యర్‌ల ఫిట్‌నెస్‌పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇంతలో వాళ్లిద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు, మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించినట్లు వార్తలు. ఇద్దరూ హుషారుగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు కూడా ఆడేస్తున్నట్లు జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA) వర్గాలు సమాచారం ఇచ్చాయి. అంతా ఓకే అనుకుంటుండగా ఆసియా కప్‌ జట్టును ప్రకటించారు సెలక్టర్లు. రాహుల్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌కూ జట్టులో చోటిచ్చారు. కానీ అంతలోనే చిన్న ట్విస్ట్‌ ఇచ్చారు. తొడ గాయం నుంచి రాహుల్‌ కోలుకున్నాడని, కానీ అతడికేదో మళ్లీ చిన్న గాయం అయిందని చెబుతూ ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు అతణ్ని దూరం పెట్టారు. శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రం పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించారు. 

అప్పటి బస్సు డ్రైవర్‌.. ఇప్పుడు టీమ్‌ ఇండియా త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌

అయితే రాహుల్‌ రెండు మ్యాచ్‌ల అనంతరం పాకిస్థాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. కానీ ఇంతలో శ్రేయస్‌ అయ్యర్‌కు మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టింది. రాహుల్‌ అందుబాటులోకి వచ్చిన మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. తన స్థానంలోనే రాహుల్‌ ఆడాడు. వరుసగా రెండు మ్యాచ్‌లకు శ్రేయస్‌ దూరమైన సంగతి తెలిసిందే. రాహుల్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో తొడ గాయంతో ఆటకు దూరమై శస్త్రచికిత్స చేయించుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ అంతకంటే ముందు వెన్ను గాయానికి గురయ్యాడు. అతనూ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇద్దరూ కొన్ని నెలల పాటు ఎన్‌సీఏలో ఉండి కోలుకున్నారు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించారు అనుకున్నాక మళ్లీ వీరిని గాయాలు ఇబ్బంది పెట్టాయి. మరి అన్ని నెలలు ఎన్‌సీఏలో వైద్యుల పర్యవేక్షణలో ఉండి వీళ్లు ఏం కోలుకున్నారన్నది ప్రశ్న.

అదే క(వ్య)థ!

ఫిట్‌నెస్‌ విషయంలో ఈ అయోమయం రాహుల్, శ్రేయస్‌లకే పరిమితం కాదు. కొంత కాలంగా భారత జట్టులో ఇంజురీ మేనేజ్‌మెంట్‌ ఏమాత్రం బాగా లేదని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సంగతే తీసుకుంటే.. గత నెలలో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో పునరాగమనం చేయడానికి ముందు గత ఏడాది వ్యవధిలో అతను 5 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు మాత్రమే ఆడాడు. అతను గాయపడటం.. కోలుకుని జట్టులోకి రావడం.. మళ్లీ గాయపడి ఆటకు దూరం కావడం.. ఇదీ వరస. నిరుడు టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఫిట్‌నెస్‌ సాధించినట్లే సాధించి మళ్లీ గాయపడి సుదీర్ఘ కాలం ఆటకు దూరమయ్యాడు. మరో పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ విషయంలోనూ ఇదే జరిగింది. 

గాయంతో పోరాడుతూ 2022 ఐపీఎల్‌కు కూడా అతను దూరమయ్యాడు. ఒక సమయంలో టీమ్‌ఇండియా ప్రధాన బౌలర్‌గా ఉన్న అతను.. గాయాల కారణంగానే జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. మళ్లీ మళ్లీ గాయపడటంతో సెలక్టర్లు అతణ్ని పక్కన పెట్టేశారు. మరో పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ సైతం భారత జట్టులో అవకాశం అందుకున్నట్లే అందుకుని గాయంతో దూరమయ్యాడు. ఇటీవలే అతను కోలుకుని జట్టులో చోటు సంపాదించాడు కానీ.. మళ్లీ ఎప్పుడు గాయపడతాడో తెలియదు. బుమ్రా, శ్రేయస్, రాహుల్‌ లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో దీర్ఘ కాలం పోరాడి తిరిగొచ్చారు. ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించారు. కానీ టోర్నీ మొదలయ్యే లోపు, మొదలయ్యాక వీళ్లు ఎంతమాత్రం ఫిట్‌నెస్‌తో ఉంటారన్నది ప్రశ్నార్థకం.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు