Shikhar Dhawan: గబ్బర్‌ మళ్లీ వస్తాడా..?

టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్‌ (Shikhar Dhawan) ఇటీవల జట్టులోకి ఎంపిక కావడం లేదు. తాజాగా ఆసియా క్రీడలకు ప్రకటించిన జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో అతడి క్రికెట్‌ భవితవ్యం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది.

Updated : 19 Jul 2023 16:35 IST

‘‘శిఖర్ ధవన్‌కు అవకాశాలకు ఎల్లవేళలా తలుపులు తెరిచే ఉంటాయి. మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియా పెద్ద మొత్తం మ్యాచ్‌లతో క్యాలెండర్‌ ఫుల్‌గా ఉంది. భారీ టోర్నీల్లో బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది. అందుకోసం బ్యాకప్‌ ఆటగాళ్లను రెడీగా ఉంచుతాం. ఇప్పుడు అజిత్ అగార్కర్‌ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. వారు యువకులకు అవకాశం ఇవ్వాలని భావిస్తే ఇస్తారు. లేకపోతే సీనియర్ల అవసరం ఉందనిపిస్తే వారినే ఎంచుకుంటారు’’.. ఇవీ ఆసియా క్రీడల కోసం భారత జట్టును ఎంపిక అనంతరం ఓ బీసీసీఐ అధికారి చేసిన వ్యాఖ్యలు. 

మొన్నటి వరకు సీనియర్‌ ప్లేయర్‌ శిఖర్ ధవన్‌ స్థానానికి ఎటువంటి ఢోకాలేకుండా పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో ప్రధాన జట్టు టోర్నీల్లోకానీ, కీలకమైన పర్యటనలకు వెళ్లినప్పుడు.. ధవన్‌కు ఓ జట్టును అప్పగించిన సందర్భాలూ ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌ సన్నాహాల్లో ధవన్‌ ఉండటం ఖాయమనే వ్యాఖ్యలూ ఉన్నాయి. ఓపెనర్‌గా శుభారంభం అందిస్తాడు. అవసరమైన దూకుడు.. నిదానం ఇలా ఏదైనా పరిస్థితికి తగ్గట్లుగా ఆడతాడనే పేరు సంపాదించాడు. ఇటీవల ఐపీఎల్‌లోనూ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌గా ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేశాడు. పంజాబ్‌ చేసిన 143 పరుగుల్లో ఏకంగా 99 రన్స్‌ ధవన్‌వే అంటే మీరు నమ్మగలరా..? అలాంటి సీనియర్‌ను గత కొన్ని రోజులుగా బీసీసీఐ బెంచ్‌కే పరిమితం చేసింది. తాజాగా ఆసియా క్రీడల కోసమూ శిఖర్‌నే కెప్టెన్‌గా నియమిస్తారనే చర్చ కూడా వచ్చింది. పొట్టి ఫార్మాట్‌ కావడంతో కెప్టెన్సీ దేవుడెరుగు.. జట్టులోనే అవకాశం లేకుండాపోయింంది. 

గోల్డ్‌ మెడల్‌ నెగ్గడమే మా కల: రుతురాజ్ గైక్వాడ్

యువకుల నుంచి తీవ్ర పోటీ?

ప్రస్తుతం భారత్ రోహిత్ నాయకత్వంలో విండీస్‌ పర్యటనలో ఉంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ వంటి టోర్నీలకు ముందు భారత్‌ ఆడే చివరి వన్డే సిరీస్‌ కూడా ఇదే కావడం గమనార్హం. మరి అలాంటి  సిరీస్‌కు ధవన్‌ను పక్కన పెట్టేసింది. దీనికి కారణం మాత్రం యువకుల నుంచి తీవ్ర పోటీ నెలకొనడమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ధవన్‌ ఇటీవల ఎక్కువగా ఓపెనర్‌గానే బ్యాటింగ్‌ చేస్తున్నాడు. కానీ, ఇప్పుడు టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ ఒక ఓపెనర్‌గా సెటిలైన సంగతి తెలిసిందే. ఇక రెండో ఓపెనింగ్ స్థానం కోసం కేఎల్‌ రాహుల్‌ గట్టి పోటీనిచ్చాడు. ఇప్పుడు శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్, రుతురాజ్‌ గైక్వాడ్ నుంచి తీవ్ర పోటీ నెలకొనగా.. తాజాగా యశస్వి జైస్వాల్ కూడా రేసులోకి వచ్చాడు. గిల్, కిషన్‌ డబుల్‌ సెంచరీలు సాధించారు. ధవన్‌ మాదిరిగానే కిషన్‌ కూడా లెఫ్ట్‌హ్యాండర్‌ కావడంతో అతడికి సానుకూలాంశంగా మారేందుకు అవకాశం ఉంది. 

ఫిట్‌నెస్‌ సమస్యలు..

ప్రస్తుతం ధవన్‌ వయసు 37 ఏళ్లు. ఈసారి ఆసియా కప్‌, వన్డే ప్రపంచప్‌ టోర్నీలే దాదాపు చివరిగా భావించొచ్చు. అందుకే ఈసారి అవకాశం ఇవ్వాలని ధవన్‌ అభిమానులు కోరుతున్నారు. అతడి ఫామ్‌ గురించి పెద్దగా ఆందోళన లేదు కానీ.. ఫిట్‌నెస్‌ విషయంలో మాత్రం ఇబ్బంది పడుతున్నాడు.  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ధవన్‌ కంటే రెండేళ్లు మాత్రమే చిన్నవారైనప్పటికీ గాయాల బెడద వారికి పెద్దగా లేకపోవడం గమనార్హం. విరాట్ గత ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)కు వెళ్లలేదంటే అతడి ఫిట్‌నెస్‌ స్థాయి అర్థం చేసుకోవచ్చు. కానీ, ధవన్‌ మాత్రం ఇటీవల గాయాలబారిన పడుతుండటం కూడా అతడి ఎంపికపై ప్రభావం చూపనుంది. 

గత నాలుగేళ్లలో ప్రదర్శన ఇలా.. 

శిఖర్ ధవన్‌ గత వన్డే ప్రపంచ కప్ నుంచి ఇప్పటి వరకు 37 వన్డేలు ఆడాడు. మొత్తం 1,313 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 98 పరుగులు కాగా.. సగటు 41.03 మాత్రమే ఉంది. అదే సమయంలో గిల్‌ కేవలం 24 మ్యాచుల్లో 65.55 సగటుతో 1,311 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. గత పది వన్డేల్లో శిఖర్ ధవన్‌ గణాంకాలు మరీ ఘోరంగా ఉన్నాయి. ఇందులో కేవలం ఒకే ఒక్క అర్థ శతకం మాత్రమే ఉంది. ఇది కూడా ధవన్‌ను కాస్త పక్కన పెట్టేందుకు కారణమై ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఇప్పటి వరకు 167 వన్డేల్లో 44.1 సగటుతో 6,793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. 

ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని