Jasprit Bumrah: జస్ప్రీత్‌ బుమ్రా టెస్ట్‌ భవిష్యత్తు ఏంటి?

Eenadu icon
By Sports News Team Updated : 28 Jun 2025 17:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

బూమ్‌.. బూమ్.. బుమ్రా.. టీమ్‌ఇండియా అమ్ముల పొదిలో అతడో అద్భుత అస్త్రం. అతడి పేరు చెబితేనే ప్రత్యర్థి బ్యాటర్లకు హడల్‌. అతడి చేతిలోంచి బ్రహ్మాస్త్రాల్లాంటి బంతులు రాకెట్‌వేగంతో దూసుకొస్తుంటే.. వాటిని ఎదుర్కోవడం కొమ్ములు తిరిగిన బ్యాటర్లకు కూడా సవాలే. కానీ అలాంటి బుమ్రా ఇప్పుడు వెన్ను గాయంతో సతమతమవుతున్నాడు! వర్క్‌లోడ్‌తో తన పరిధి తగ్గించుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌లకే పరిమితం కాబోతున్నాడు! మరి టెస్ట్‌ ఫార్మాట్‌లో జస్ర్పీత్‌ బుమ్రా భవిష్యత్తు ఏంటి?!  

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) గాయపడ్డాడు. ఆ తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. ఐపీఎల్‌లో(IPL) ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) తరఫున తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌తో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. అయితే బుమ్రా మునుపటిలా పూర్తి ఫిట్‌గా అయితే లేడు! వర్క్‌లోడ్‌ నేపథ్యంలో అతడు ఇంగ్లాండ్‌ సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని బీసీసీఐ (BCCI) చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ముందుగానే ప్రకటించాడు. అయితే అవి ఏఏ మ్యాచ్‌లన్నది మాత్రం వెల్లడించలేదు. 

లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. 24.4 ఓవర్లపాటు బౌలింగ్‌ చేసి 83 పరుగులిచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. 19 ఓవర్లు బౌలింగ్‌ చేసి 57 పరుగులిచ్చాడు. వికెట్లు మాత్రం తీసుకోలేకపోయాడు. ఇలా మొత్తంగా మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో 43.4 ఓవర్లపాటు బౌలింగ్‌ చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ని ఓవర్లు బుమ్రా వేయడం అనేది ఓ రకంగా రిస్క్‌ తీసుకోవడమే. అందుకే వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో ఆడటం లేదని సమాచారం. అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.

టీమ్‌ఇండియాకూ కలవరమే! 

లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ జూన్‌ 24న ముగిసింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జులై 2 నుంచి ప్రారంభం కానుంది. అంటే రెండు టెస్ట్‌మ్యాచ్‌లకు మధ్య ఏడు రోజుల సమయం ఉంది. అయినా బుమ్రా రెండో మ్యాచ్‌ ఆడటంపై సందేహంగానే ఉంది. మూడో టెస్ట్ మ్యాచ్ లార్డ్స్‌ వేదికగా జులై 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు మాత్రం బుమ్రా అందుబాటులో ఉంటాడనే వార్తలు వినవస్తున్నాయి. అంటే మ్యాచ్‌కు.. మ్యాచ్‌కు మధ్య ఇన్ని రోజులు విరామం బుమ్రాకు కావాల్సి వస్తోంది! ఓ రకంగా ఇది టీమ్‌ఇండియాను కలవరపరిచే విషయమే. అంతే కాకుండా ఇది బుమ్రా టెస్ట్‌ క్రికెట్‌ భవిష్యత్తుపై కూడా అనేక సందేహాలను లేవనెత్తుతోంది. ఫిట్‌నెస్‌ సమస్యలతోనే అతడు కెప్టెన్‌ రేసు నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో.. బుమ్రా భవిష్యత్తులో సుదీర్ఘ కాలం టెస్ట్‌ క్రికెట్‌కు భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించలేడని పలువురు క్రికెట్‌ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. అతడు ఇకపై వైట్‌బాల్‌ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తాడేమో.. అని పలువురు టీమ్‌ఇండియా అభిమానులూ అభిప్రాయపడుతున్నారు. 

ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు.. 

బుమ్రా స్థానాన్ని మరో బౌలర్‌తో భర్తీ చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. కానీ.. ప్రత్యామ్నాయ బౌలర్‌ను తయారు చేసుకోవాల్సిన బాధ్యత టీమ్ఇండియా కోచ్‌, యాజమాన్యంపై ఉంది. అలాగే ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ఎంపిక కాని మహమ్మద్‌ షమీ (Mohammed Shami) విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది! ప్రస్తుతం టెస్ట్‌ జట్టులో బుమ్రా తర్వాత 37 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) సీనియర్‌ బౌలర్‌గా ఉన్నాడు. అతడు కూడా ఈ మధ్య ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. తర్వాత ఆకాశ్‌దీప్‌నకు 7, ప్రసిద్ధ్‌ కృష్ణకు 4 టెస్ట్‌ మ్యాచ్‌ల అనుభవం ఉంది. ఇక యువ బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌ ఇంత వరకు ఒక్క టెస్ట్‌ మ్యాచ్‌ కూడా ఆడలేదు. 

ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా సమీప భవిష్యత్తులో బౌలింగ్‌ పరంగా తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో యువ బౌలర్లకు ఇదే అద్భుత అవకాశమూ కానుంది. చక్కటి ప్రతిభ చాటి, జట్టులో సుస్థిర స్థానం పొందేందుకు ఇంతకంటే చక్కటి ఛాన్స్‌ మరోటి ఉండదని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. 

 - ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :
Published : 28 Jun 2025 16:19 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు