ODI WC 2023: అడ్రస్‌ లేని ఆఫ్‌ స్పిన్నర్లు... ప్రపంచ కప్‌లో లెగ్‌ స్పిన్నర్లకే పట్టం

ప్రపంచ క్రికెట్‌లో ఓ కళ క్రమక్రమంగా తగ్గిపోతోంది. అదే ఆఫ్‌ స్పిన్‌ (Off Spin). సీనియర్‌ బౌలర్లు, పార్ట్‌ బౌలర్లు తప్ప ఇంకెవరూ ఆఫ్‌ స్పిన్‌ వైపు రావడం లేదు. అలాగే జట్లు కూడా ఆఫ్‌ స్పిన్నర్ల విషయంలో శీతకన్ను వేస్తున్నాయి. (Off Spinner - Leg Spinner)

Published : 11 Sep 2023 15:53 IST

ఒకప్పుడు ఓ జట్టులో ఇద్దరు స్పిన్నర్లున్నారు అంటే.. అందులో ఒకరు ఆఫ్‌ స్పిన్నర్ (Off Spinner), మరొకరు లెగ్‌ స్పిన్నర్‌ (Leg Spinner) కావడం సాధారణం. అప్పుడే స్పిన్‌ దాడిలో వైవిధ్యం ఉంటుందని భావించేవాళ్లు. ముఖ్యంగా అప్పట్లో ఆఫ్‌స్పిన్నర్ల ఆధిపత్యం కనిపించేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఆఫ్‌స్పిన్నర్ల ప్రభావం తగ్గిపోయి అన్ని జట్లూ వారికి ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించేశాయి. ఇప్పుడంతా లెగ్‌ స్పిన్‌దే హవా. రాబోయే ప్రపంచకప్‌ (Odi World Cup 2023)లో కూడా లెగ్‌ స్పిన్నర్ల ఆధిపత్యమే చూడబోతున్నాం. ఆఫ్‌స్పిన్‌ కళే క్రమంగా కనుమరుగైపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

చైనామన్‌ చిన్నోడు.. ఫీనిక్స్‌లా లేచాడు

ఇటీవలే వన్డే ప్రపంచకప్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. టోర్నీ జరగబోయేది సొంతగడ్డ మీదే కావడంతో ఇక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయి కాబట్టి ముగ్గురు స్పిన్నర్లకు జట్టులో చోటిచ్చారు సెలక్టర్లు. కానీ ఆ ముగ్గురిలో ఒక్క కుడి చేతి వాటం ఆఫ్‌స్పిన్నరూ లేడు. కుల్‌దీప్‌ యాదవ్‌ చైనామన్‌ స్పిన్నర్‌ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ ఎడమ చేతి వాటం స్పిన్నర్లు. వాళ్ల బౌలింగ్‌ కుడిచేతి వాటం లెగ్‌ స్పిన్నర్లు బంతులేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కుల్‌దీప్‌ ఎడమచేతి వాటంలో ఆఫ్‌స్పిన్‌ వేస్తాడు. ఆ శైలినే ‘చైనామన్‌’ అంటారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ రూపంలో సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ అందుబాటులో ఉన్నా.. అతడికి ప్రపంచకప్‌ జట్టులో చోటివ్వలేదు. 

 

అతను కాకుండా దేశవాళీ క్రికెట్లో పేరున్న ఆఫ్‌స్పిన్నర్లు కనిపించడం లేదు. గత కొన్నేళ్లలో ఆఫ్‌స్పిన్‌కు ప్రపంచ క్రికెట్లో ప్రాధాన్యం తగ్గిపోతూ వస్తుండటంతో వర్ధమాన ఆటగాళ్లలో స్పెషలిస్టు స్పిన్నర్లుగా మారాలనుకుంటే లెగ్‌ స్పిన్‌ను ఎంచుకుంటున్నారే తప్ప.. ఆఫ్‌స్పిన్‌ జోలికి వెళ్లట్లేదు. భారత్‌ అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని జట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని ప్రధాన జట్లలోనూ స్పెషలిస్టు స్పిన్నర్లంతా మణికట్టును ఉపయోగించి స్పిన్‌ చేసేవాళ్లే. వేలితో బంతిని తిప్పేవాళ్లు చాలా తక్కువమంది కనిపిస్తున్నారు. ప్రధానంగా బ్యాటర్లుగా ఉండి పార్ట్‌టైం స్పిన్‌ వేసే వాళ్లు మాత్రమే ఆఫ్‌స్పిన్నర్లుగా ఉంటున్నారు.

ఫామ్‌తో కుస్తీలు... ప్రపంచకప్‌ జట్టులో వీళ్లు అర్హులేనా?

ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ జట్టుకి ఎంపికైన ఏకైక స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ అడిల్‌ రషీద్‌ మణికట్టు బౌలర్‌ అన్న సంగతి తెలిసిందే. పార్ట్‌టైం బౌలింగ్‌ వేసే మొయిన్‌ అలీ, లివింగ్‌ స్టోన్‌ ఆఫ్‌స్పిన్‌ వేస్తారు. ఆస్ట్రేలియా జట్టులోనూ ప్రధాన స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా లెగీనే. మరో స్పిన్నర్‌ అస్టాన్‌ అగార్‌ ఎడమచేతి వాటం బౌలర్‌. ఆ జట్టులో పార్ట్‌టైమర్‌లు అయిన మ్యాక్స్‌వెల్, ట్రావిస్‌ హెడ్‌ ఆఫ్‌స్పిన్‌ వేస్తారు. దక్షిణాఫ్రికా జట్టులో షంసి చైనామన్‌ బౌలర్‌. కేశవ్‌ మహరాజ్‌ ఎడమచేతి వాటం స్పిన్నర్‌. పాక్‌ జట్టులో షాదాబ్‌ ఖాన్‌ లెగీనే. మరో స్పిన్నర్‌ మహ్మద్‌ నవాజ్‌ది ఎడమచేతి వాటం. న్యూజిలాండ్‌ స్పిన్‌ విభాగాన్ని నడిపిస్తున్న శాంట్నర్, రచిన్‌ రవీంద్ర ఎడమచేతి వాటం స్పిన్నర్లే.

 

ఏమిటి కారణం?

ప్రపంచ టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్‌ ఆఫ్‌స్పిన్నర్‌. భారత దిగ్గజ బౌలర్లలో ఒకడైన హర్భజన్‌ సింగ్‌ది ఈ శైలే. ఇంకా సక్లయిన్‌ ముస్తాక్, అశ్విన్, సయీద్‌ అజ్మల్, గ్రేమ్‌ స్వాన్‌ లాంటి మేటి ఆఫ్‌స్పిన్నర్లను చూశాం ప్రపంచ క్రికెట్లో. అయితే టీ20ల రంగ ప్రవేశంతో ఆఫ్‌స్పిన్నర్ల హవాను తెరపడిందని చెప్పొచ్చు. ఆఫ్‌స్పిన్నర్ల మీద ఎదురు దాడి చేయడం బ్యాటర్లకు తేలికైపోయింది. ఆఫ్‌స్పిన్నర్లు వేళ్లతో బంతిని పట్టుకునే తీరును బట్టే బ్యాటర్లు ఎలాంటి షాట్‌ ఆడాలో అంచనా వేసుకుంటున్నారు. బంతిని ఎంత టర్న్‌ చేసినా షాట్లు ఆడేస్తున్నారు. టీ20ల్లో ఆఫ్‌స్పిన్నర్‌ బంతి అందుకుంటే బ్యాటర్లకు పండగే అన్నట్లు తయారైంది పరిస్థితి. లెగ్‌స్పిన్నర్లతో పోలిస్తే ఆఫ్‌స్పిన్నర్లలో వైవిధ్యం తక్కువ కావడంతో దూకుడుగా ఆడే కొత్తతరం బ్యాటర్లు వారి బౌలింగ్‌ను అలవోకగా ఆడేస్తున్నారు. అందుకే అన్ని జట్లూ ఆఫ్‌స్పిన్నర్లకు ప్రాధాన్యం తగ్గించేశాయి. కొత్తగా ఆఫ్‌స్పిన్‌ను ఎంచుకునే స్పెషలిస్టు బౌలర్లూ తగ్గిపోయారు.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు