Team India : ఫామ్‌తో కుస్తీలు... ప్రపంచకప్‌ జట్టులో వీళ్లు అర్హులేనా?

వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) కోసం టీమ్‌ ఇండియా జట్టును ఇటీవల BCCI ప్రకటించింది. 15 మంది జట్టులో ఓ ముగ్గురి విషయంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాళ్లే సూర్య కుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav), అక్షర్‌ పటేల్‌ (Axar Patel), శార్దూల్‌ ఠాకూర్‌ (Shardul Thakur).

Updated : 08 Sep 2023 12:12 IST

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023)కు అన్ని దేశాలూ జట్లను ప్రకటించేశాయి. కప్పుపై కన్నేసిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లనే ఎంచుకున్నాయి. ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. కానీ, టీమ్‌ఇండియా (Team India) మాత్రం ఇప్పటిదాకా కెరీర్లో ఏమంత గొప్ప ప్రదర్శన లేకపోయినా, ఇటీవలి ఫామ్‌ కూడా బాలేకున్నా కొందరు ఆటగాళ్లను ప్రపంచకప్‌నకు తీసుకెళ్తోంది. మరి సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని ఆ ఆటగాళ్లు నిలబెడతారా? లేక ప్రపంచకప్‌లో జట్టు అవకాశాలను దెబ్బ తీస్తారా?

ప్రస్తుతం టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిల ఫామ్‌ కూడా ఒకప్పటిలా పతాక స్థాయిలో లేని మాట వాస్తవం. కానీ, వాళ్ల సామర్థ్యం ఏంటో అందరికీ తెలుసు. తమదైన రోజున వారిని అడ్డుకోవడం అసాధ్యం. వాళ్లు కొత్తగా రుజువు చేసుకోవాల్సిందేమీ లేదు. లయ అందుకుంటే వీరు జట్టుకు ఎంత ఉపయోగపడగలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోని, తామేంటో పూర్తి స్థాయిలో రుజువు చేసుకోని ఆటగాళ్ల విషయంలోనే అభిమానుల్లో ఆందోళన నెలకొంది. జట్టుకు భరోసానివ్వలేకపోతున్న ఆ ఆటగాళ్లే.. అక్షర్‌ పటేల్, శార్దూల్‌ ఠాకూర్, సూర్యకుమార్‌ యాదవ్‌.

అంతంతమాత్రం అక్షర్‌

టీమ్‌ఇండియాకు చాన్నాళ్లుగా ఆడుతున్నప్పటికీ ఒక స్థాయి అందుకోని ఆటగాడు అక్షర్‌ పటేల్‌. తన రాష్ట్రానికే చెందిన జడేజా లాగే లెఫ్టార్మ్‌ స్పిన్నర్, ఆల్‌రౌండర్‌ అయిన అక్షర్‌.. జడ్డూ లాగా ఆల్‌రౌండ్‌ మెరుపులు మెరిపించింది తక్కువ. మూడు ఫార్మాట్లలో ఆడుతున్నప్పటికీ అతడి గణాంకాలు అంతంతమాత్రం. వన్డేల విషయానికే వస్తే.. 50 మ్యాచ్‌ల్లో 58 వికెట్లు మాత్రమే తీశాడు. అతడి బౌలింగ్‌ సగటు 32కు చేరువగా ఉండటం గమనార్హం. అతడి బ్యాటింగ్‌ పర్వాలేదు. 19 సగటుతో 413 పరుగులు నమోదు చేశాడు. ఇలాంటి గణాంకాలతో వన్డే జట్టులో కొనసాగుతుండటం, పైగా ప్రపంచకప్‌కు ఎంపిక కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. 

వన్డే ప్రపంచ కప్‌... 2003, 2019 సీన్ రిపీట్‌ అవుతుందా?

ఇలాంటి ప్రదర్శనతో మరే పెద్ద జట్టులోనూ ఓ ఆటగాడు ప్రపంచకప్‌ అవకాశం అందుకుని ఉండడంటే అతిశయోక్తి కాదు. అక్షర్‌ ఇటీవలి ఫామ్‌ పేలవంగా ఉన్నప్పటికీ అతణ్ని ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేశారు. అశ్విన్, చాహల్‌ లాంటి స్పిన్నర్లను కాదని అక్షర్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనయుడైన జై షా బీసీసీఐ కార్యదర్శి అయ్యాక అతడి సొంత రాష్ట్రానికి చెందిన అక్షర్‌ పటేల్‌కు ప్రదర్శనతో సంబంధం లేకుండా టీమ్‌ఇండియాలో చోటు దక్కుతోందన్న ఆరోపణలుండటం గమనార్హం. మరి ప్రపంచకప్‌ తుది జట్టులో ఆడే అవకాశం వస్తే అక్షర్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.

శార్దూల్‌ సత్తా చాటాలి

శార్దూల్‌ ఠాకూర్‌ ప్రతిభావంతుడైన బౌలరే కానీ.. అతడికి నిలకడ లేమి పెద్ద సమస్య. ఒక మ్యాచ్‌లో అదరగొడతాడు. తర్వాత వరుసగా కొన్ని మ్యాచ్‌లు విఫలమవుతాడు. వికెట్లు బాగానే తీస్తాడని పేరుంది కానీ.. ధారాళంగా పరుగులు ఇచ్చేయడం బలహీనత. ఇప్పటిదాకా 40 వన్డేలాడిన శార్దూల్‌ 29.11 సగటుతో 59 వికెట్లే తీశాడు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోలిస్తే ఈ ప్రదర్శన సాధారణం. లోయర్‌ ఆర్డర్లో కొన్నిసార్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతుంటాడు శార్దూల్‌. అతణ్ని తరచుగా వన్డే జట్టులో ఆడిస్తుండటానికి, ప్రపంచకప్‌ ఎంపికకు అది కూడా ఒక కారణమే. కానీ శార్దూల్‌ బౌలింగ్‌ మాత్రం మెరుగుపడాల్సి ఉంది. అర్ష్‌దీప్, ఉమ్రాన్‌ మాలిక్‌ వన్డేల్లో రాణించకపోవడం.. ప్రసిద్ధ్‌ కృష్ణ గాయంతో ఇబ్బంది పడటం శార్దూల్‌కు కలిసొచ్చి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది. అతను తుది జట్టులో కూడా కొనసాగే అవకాశాలే ఎక్కువ. మరి తన ఎంపిక సరైందే అని తన ఆటతో శార్దూల్‌ రుజువు చేస్తాడేమో చూడాలి.

టీ20లో సూపర్‌ సూర్య.. కానీ...

సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20ల్లో ఎంత ప్రమాదకర ఆటగాడో కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున మెరుపులు మెరిపించి.. టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్న అతను.. అనతి కాలంలోనే టీ20ల్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఆ ఫార్మాట్లో ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాటర్‌గానూ మారాడు. ఈ ప్రదర్శన చూసి వన్డేలు, టెస్టుల్లోనూ అతడికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు పెరిగాయి. అయితేటెస్టుల సంగతి పక్కన పెడితే.. వన్డేల్లోనూ సూర్య సత్తా చాటలేకపోయాడు. వరుసగా అవకాశాలు ఇస్తున్నా ఉపయోగించుకోలేకపోయాడు. 

కార్డియాక్ కిడ్స్... నేపాల్ క్రికెటర్లతో అంత వీజీ కాదు!

తొలి బంతి నుంచే విధ్వంసం సృష్టించే టీ20లు అతడికి నప్పుతున్నాయి కానీ.. కొంచెం నిలిచి ఆడాల్సిన వన్డేల్లో సూర్యకుమార్‌ రాణించలేకపోతున్నాడు. ఇప్పటిదాకా 26 వన్డేలాడిన సూర్య.. 24.33 సగటుతో 511 పరుగులే చేశాడు. అందులో ఒక్క అర్ధశతకం కూడా లేదు. చివరగా వెస్టిండీస్‌ సిరీస్‌లో ఆడిస్తే అందులోనూ విఫలమయ్యాడు. ఆసియా కప్‌కు తుది జట్టులో ఆడించట్లేదు కానీ.. ప్రపంచకప్‌కు మాత్రం సూర్యను ఎంపిక చేశారు. అతడి స్థానంలో యువ ఆటగాడైన తిలక్‌ వర్మను ఎంపిక చేయాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత ప్రదర్శన ప్రకారం సూర్యను ప్రపంచకప్‌లో తుది జట్టులో ఆడించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని