MS Dhoni: టీ20 వరల్డ్ కప్‌.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’

ఐపీఎల్‌లో ఫినిషర్‌గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. 

Published : 25 Apr 2024 00:26 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) అదరగొడుతున్నాడు. ఫినిషర్‌గా బరిలోకి దిగుతూ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటివరకు 35 బంతులు ఎదుర్కొని 91 పరుగులు చేశాడు. ఈ ఏడాది ధోనీ ఒక్కసారీ ఔట్ కాలేదు. మరోవైపు, జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం మరికొన్ని రోజుల్లో సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ధోనీని టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేయాలనే ఆలోచనను మాజీలు తెర పైకి తెచ్చారు. ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌ కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, ఆరోన్ ఫించ్ టీ20 ప్రపంచకప్‌నకు ధోనీ ‘వైల్డ్‌కార్డ్’ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందన్న విషయంపై చర్చించారు. 

టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్ జట్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంఎస్ ధోనీని చూస్తామా? అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆశ్చర్యం వ్యక్తంచేశాడు. అదేగనుక జరిగితే అది ‘వైల్డెస్ట్‌ కార్డ్’ అవుతుందన్నాడు. ‘‘ధోనీ టీ20 ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నానని చెబితే ఆ ప్రతిపాదనను ఎవరూ తిరస్కరించరు. అతడి రాకతో ఎవరికీ ఇబ్బంది ఉండదు. ధోనీ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. 

‘ధోనీని మించిన ఆటగాడు ఎవరున్నారు’

‘‘ధోనీ 255 స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నాడు. ఇంతవరకు ఔట్ కాలేదు కాబట్టి యావరేజ్‌ లేదు. టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ని చూస్తే.. మనం ఎన్ని మంచి జట్లతో తలపడతాం? ధోనీ మొదటి రౌండ్‌లో బ్యాటింగ్ చేయడు. కేవలం వికెట్‌ కీపింగ్ చేయాలి. సీఎస్కేలో ఇప్పుడు ఎలాగో అదే చేస్తున్నాడు. ధోనీ కేవలం మూడు జట్లపై బ్యాటింగ్‌కు దిగాలి. అవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా. పాకిస్థాన్‌ను కూడా లెక్కలోకి తీసుకుంటే నాలుగు టీమ్‌లు అవుతాయి. అది కూడా చివరి మూడు ఓవర్లలో వచ్చి బ్యాటింగ్ చేయాలి. ఈ విషయంలో ధోనీని మించిన ఆటగాడు ఎవరున్నారు?’’ అని సెహ్వాగ్ ఇటీవల ఓ క్రీడా ఛానల్‌తో అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని