Sehwag-Bharat: వన్డే ప్రపంచకప్‌లో మన ఆటగాళ్లు ‘టీమ్‌భారత్’ జెర్సీలు ధరించాలి: వీరేంద్ర సెహ్వాగ్

వన్డే ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు ‘భారత్‌’ (Bharat) అని రాసి ఉన్న జెర్సీలతో ఆడాలని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కోరాడు. 

Updated : 05 Sep 2023 17:31 IST

ఇంటర్నెట్ డెస్క్: అక్టోబర్ 5 నుంచి స్వదేశంలో ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు ‘భారత్‌’ (Bharat) అని రాసి ఉన్న జెర్సీలతో ఆడాలని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కోరాడు. ఆ దిశగా ఆలోచన చేయాలని బీసీసీఐ కార్యదర్శి జైషాకి విజ్ఞప్తి చేశాడు. కేంద్రం ‘ఇండియా’ పేరును ఆంగ్లంలో ‘భారత్‌’గా మార్చే యోచనలో ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 18 నుంచి 22 మధ్య ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు ఊహగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్.. టీమ్‌ఇండియాకు బదులు ‘భారత్’ పేరుతో ఉన్న జెర్సీలను ధరించాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. సెహ్వాగ్‌ తన ట్విటర్‌ (x) బయోలో ‘భారతీయుడిగా గర్విస్తున్నా’ అని మార్చుకున్నాడు. ఇది వరకు ‘ఇండియన్‌గా గర్విస్తున్నా’ అని ఉండేది.

అందరూ మా గురించే మాట్లాడతారు.. కానీ అతడే అసలైన హీరో: గౌతమ్ గంభీర్‌

‘‘నెదర్లాండ్స్ 1996 ప్రపంచ కప్‌లో హాలండ్‌ పేరుతో ఆడింది. 2003లో మేం ఆ జట్టుతో ఆడినప్పుడు నెదర్లాండ్స్ పేరుతోనే బరిలోకి దిగారు. బ్రిటిష్‌ వారు పెట్టిన బర్మా పేరును మయన్మార్‌గా మార్చుకున్నారు. చాలా దేశాలు తిరిగి అసలు పేరుకు మారాయి. రానున్న వన్డే ప్రపంచకప్‌లో మన ఆటగాళ్లు టీమ్‌ఇండియాకు బదులు ‘టీమ్‌భారత్’ అని ఉన్న జెర్సీలను ధరించాలి. ఆ దిశగా బీసీసీఐ ఆలోచించాలి’’ అని సెహ్వాగ్ ట్వీట్‌లు చేశాడు. ఇదిలా ఉండగా, వన్డే ప్రపంచకప్ కోసం నేడు భారత జట్టును ప్రకటించారు. చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ రోహిత్‌ శర్మ (Rohit Sharma) కెప్టెన్‌గా 15 మందితో జట్టుని ఎంపిక చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని