Yashasvi Jaiswal: ఒకే సిరీస్‌లో 600+ పరుగులు.. యశస్వి మరో రికార్డ్‌

Yashasvi Jaiswal: టీమ్‌ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. గావస్కర్‌, ద్రవిడ్‌, కోహ్లీ లాంటి దిగ్గజాల సరసన చేరాడు.

Updated : 24 Feb 2024 16:25 IST

రాంచీ: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌ (IND vs ENG Test Match)లో వరుస డబుల్‌ సెంచరీలతో అదరగొట్టిన యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) మరో అరుదైన రికార్డ్‌ సాధించాడు. ఒకే సిరీస్‌లో 600లకు పైగా పరుగులతో అదరగొట్టి ఈ ఘనతను అందుకున్న ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు.

గతేడాది వెస్టిండీస్‌ పర్యటనతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌.. తాజా సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రెండు ద్విశతకాలు నమోదు చేశాడు. కేవలం ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 618 పరుగులు (తొలి టెస్టులో 80, 15; రెండో టెస్టులో 209, 17; మూడో టెస్టులో 10, 214; నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 73) సాధించాడు.

ఫుడ్ నచ్చలేదన్న హార్దిక్‌.. సిబ్బందిపై పంత్‌ సీరియస్‌: ఐపీఎల్‌ యాడ్ వీడియోలు లీక్‌

యశస్వి కంటే ముందు దిలీప్‌ సర్దేశాయ్‌, సునీల్‌ గావస్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, విరాట్‌ కోహ్లీ ఇలా ఒకే టెస్టు సిరీస్‌లో 600 కంటే ఎక్కువ పరుగులు చేసి రికార్డ్‌ సృష్టించారు. 1970-71లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో దిలీప్‌ ఈ ఘనత సాధించాడు. గావస్కర్‌, కోహ్లీ తమ కెరీర్‌లో రెండుసార్లు ఈ మైలురాయిని దాటారు.

1970-71లో జరిగిన అదే వెస్టిండీస్‌ సిరీస్‌లో గావస్కర్‌ ఏకంగా 774 పరుగులు చేయగా.. 1978-79లో ఇదే జట్టుపై మరోసారి 732 పరుగులతో చెలరేగాడు. ఇప్పటివరకు భారత్‌ తరఫున ఒక టెస్టు సిరీస్‌లో 700లకు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు గావస్కరే. తాజా సిరీస్‌లో మిగిలిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ యశస్వి ఇదే ఫామ్‌ కొనసాగిస్తే ఈ రికార్డ్‌ను కచ్చితంగా అధిగమిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక, టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఆస్ట్రేలియా దిగ్గజం డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 1930లో ఇంగ్లాండ్‌పై ఐదు టెస్టుల్లో అతడు ఏకంగా 974 పరుగులు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని