BCCI: బీసీసీఐ ‘దేశవాళీ’ నిర్ణయం.. కుర్రాళ్లకు గుణపాఠం

ఒకటీ, రెండు మ్యాచ్‌లు ఆడగానే.. తామే స్టార్లుగా భావించే ఆటగాళ్లు ఇటీవల ఎక్కువైపోయారు. అలాంటివారికి బీసీసీఐ షాక్‌ ఇచ్చింది.

Published : 29 Feb 2024 18:08 IST

భారత జట్టులో స్థానం ప్రతీ క్రికెటర్‌కు పెద్ద కల. ఎన్నో కష్టాలు.. ఎంతో పోటీని తట్టుకుని ఎట్టకేలకు చోటు దక్కించుకుంటున్నారు కుర్రాళ్లు. కానీ జట్టులోకి వచ్చాక చాలామందిలో అప్పటివరకు ఉన్న కమిట్‌మెంట్‌ మాయమైపోతుంది. వారి ఆటలో మార్పు వస్తుంది. ప్రవర్తనలో తేడా వస్తుంది. మొత్తానికే కెరీరే దెబ్బ తింటోంది. ఇటీవల కుర్ర క్రికెటర్లను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. క్రమశిక్షణ లోపించడంతో బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పోగొట్టుకున్న శ్రేయస్‌ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌లే ఇందుకు ఉదాహరణ. నిబంధనలు మీరితే మున్ముందు కఠిన శిక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుందని బీసీసీఐ ఈ సంఘటనతో తెలియజేసింది.

రంజీలు ఆడకపోతే

అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో దేశవాళీ క్రికెట్లో అత్యున్నత టోర్నీ అయిన రంజీ  ట్రోఫీలో ఆడాలన్నది బీసీసీఐ నిబంధన. కానీ ప్రస్తుత తరం క్రికెటర్లు ఈ నిబంధనను పట్టించుకోవట్లేదు. కాస్త పేరు రాగానే.. కొంచెం బిజీ కాగానే తాము పెద్ద క్రికెటర్లన్న భావనలో ఉంటున్న యువ ఆటగాళ్లు రంజీని చిన్నచూపు చూస్తున్నారు. ఇటీవల ఇషాన్‌ కిషన్, శ్రేయస్‌ అయ్యర్‌ల ప్రవర్తనే ఇందుకు నిదర్శనం. దక్షిణాఫ్రికా పర్యటనలో వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వస్తున్నట్లు చెప్పిన ఇషాన్‌ కిషన్‌.. దుబాయ్‌లో పార్టీలో కనబడడం బీసీసీఐకి ఆగ్రహాన్ని తెప్పించింది. మరోవైపు గాయం పేరుతో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌కు దూరమయ్యాడు శ్రేయస్‌ అయ్యర్‌. కానీ శ్రేయస్‌కు గాయం సమస్య ఏమీ లేదని ఎన్‌సీఏ ఫిజియో చెప్పడం చర్చనీయాంశమైంది. జాతీయ జట్టులోకి రావాలంటే ఫామ్‌ నిరూపించుకోవాలనే నిబంధనను ఈ యువ ఆటగాడు ఉల్లంఘించాడు. దీనికితోడు రంజీల్లో ఆడాలని బీసీసీఐ పెద్దలు చెప్పిన మాటలను కూడా ఇషాన్, శ్రేయస్‌ పెడచెవిన పెట్టారు. పైగా హార్దిక్‌ పాండ్యతో కలిసి ఐపీఎల్‌ శిక్షణలో పాల్గొనడం ఇషాన్‌పై నెగెటివిటీని పెంచింది. ఇవన్నీ కలిసి ఈ స్టార్‌ క్రికెటర్లు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను పోగొట్టుకునేందుకు కారణమయ్యాయి.

ఒకప్పుడు అలా..

భారత్‌లోనే అత్యున్నత దేశవాళీ టోర్నీ రంజీ. ఇందులో ఆడటాన్ని ఏ క్రికెటర్‌ అయినా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. కానీ నేటితరం కుర్ర క్రికెటర్ల ఆలోచనలు వేరేలా ఉంటున్నాయి. పేరు, పలుకుబడి సంపాదించాక జూనియర్‌ ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం నామోషీగా భావిస్తున్నారు. రంజీల్లో దిగితే ఏదో లెవల్‌ పడిపోయినట్లుగా అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు సునీల్‌ గావస్కర్, సచిన్‌ తెందుల్కర్, సౌరభ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్, వీవీఎస్‌ లక్ష్మణ్‌ లాంటి దిగ్గజాలు రంజీలు ఆడటాన్ని ఎంతో ఆస్వాదించేవాళ్లు. యువ ఆటగాళ్లకు తమ అనుభవాన్ని పంచుతూ ఫామ్‌ను నిరూపించుకునేవాళ్లు. కెరీర్‌ చివరిలో కూడా గంగూలీ రంజీ మ్యాచ్‌లు ఆడి భారత జట్టులోకి వచ్చాడు. ఈ తరం క్రికెటర్లలో ఆ కాంక్ష తగ్గిపోయింది. డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయింది. ఐపీఎల్‌ పుణ్యమా అని ఒక్క దేశవాళీ మ్యాచ్‌ ఆడకపోయినా జాతీయ జట్టుకు ఆడే అదృష్టాన్ని దక్కించుకుంటున్నారు కుర్రాళ్లు. కానీ ఇలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోగా.. అనవసర పోకడలతో కెరీర్‌లను ముగిస్తున్నారు. పృథ్వీ షా కూడా ఈ కోవకు చెందినవాడే. ఎంతో ప్రతిభావంతుడైన ఈ ఓపెనర్‌.. ఆటేతర వివాదాలతో గాడి తప్పాడు. బరువు పెరిగిపోయి.. ఆట తగ్గిపోయి తెరమరుగయ్యే పరిస్థితికి వచ్చాడు. 

ఒకప్పుడు జాతీయ జట్టులో స్థానం దక్కకపోతే రంజీల్లో రాణించి సెలక్టర్లపై ఒత్తిడి పెంచేవాళ్లు. అయితే ఇప్పుడు కుర్రాళ్లు మాత్రం ఐపీఎల్‌లో రాణించడంపైనే దృష్టి పెడుతున్నారు. నిజానికి ఐపీఎల్‌ అసలైన సత్తాకు పరీక్షగా నిలవదు. నాలుగురోజుల దేశవాళీ ఫార్మాట్లోనే ఫామ్‌ ఎలా ఉందో తెలుస్తుంది. కానీ కుర్రాళ్లు ఈ బేసిక్‌ విషయాన్ని మరిచిపోయి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా శ్రేయస్, ఇషాన్‌ల సంఘటనతోనైనా మిగిలిన కుర్రాళ్లు జాగ్రత్త పడడం అవసరం. భారత జట్టులో అవకాశం అంటే తేలిక కాదు అని తెలుసుకోవడం అత్యవసరం. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని