BRS: కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌

Eenadu icon
By Telangana News Team Published : 02 Sep 2025 18:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవితను సస్పెండ్‌ చేస్తూ కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ‘‘కేసీఆర్‌ నిర్ణయంతో మహిళలు ఎక్కువగా సంతోషపడుతున్నారు. కవిత వ్యాఖ్యలు భారత రాష్ట్ర సమితికి నష్టం చేసేలా, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. నష్ట నివారణ, కార్యకర్తలకు స్థైర్యం ఇచ్చేందుకు కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా ఉపేక్షించేది లేదని ఆయన గతంలో చెప్పారు.. అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారు.

20 నెలలుగా కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేస్తుంటే.. కవిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తున్నాయి. పార్టీని నమ్ముకున్న సైనికుల కంటే పేగుబంధం గొప్పది కాదని కేసీఆర్ భావించారు. కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాం’’ అని సత్యవతి రాథోడ్‌ అన్నారు.

భారత రాష్ట్ర సమితిని విమర్శిస్తే.. కేసీఆర్‌ను విమర్శించినట్టే: గొంగిడి సునీత

భారత రాష్ట్ర సమితిని విమర్శిస్తే.. కేసీఆర్‌ను విమర్శించినట్టేనని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ‘‘పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత అని కవిత అంటున్నారు. రెండు సార్లు ఎంపీ టికెట్‌, రెండు సార్లు ఎమ్మెల్సీ అవకాశం ఎలా వచ్చింది. క్షేత్రస్థాయికి వెళ్తే కవితకు పరిస్థితులు అర్థం అవుతాయి. కవితకు కేసీఆర్‌ కన్నతండ్రి.. కోట్లాది మంది ప్రజలు కేసీఆర్‌ను బాపు అని పిలుచుకుంటున్నారు. పార్టీకి చాలా మంది ద్రోహం చేశారు. అందులో తాను కూడా ఉండాలని కవిత అనుకుంటే ఏం చేయలేం. కవిత తనకు తానే గొయ్యి తీసుకున్నట్లు అర్థం అవుతుంది. వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో కాలమే తేలుస్తుంది. కవితకు పార్టీ అనేక అవకాశాలు కల్పించింది. పార్టీ నుంచి బయటకు వెళ్లిన చాలా మంది ఏమయ్యారో అందరికీ తెలుసు, కవిత కూడా అంతే’’ అని సునీత అన్నారు.

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు బాధ కలిగించాయి

హరీశ్‌రావు, సంతోష్‌పై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు బాధ కలిగించాయని మాజీ ఎంపీ మాలోత్‌ కవిత అన్నారు. ‘‘పేగు బంధం కంటే.. పార్టీ బంధం, ప్రజా బంధం గొప్పది అని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ నాడు తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఇవాళ పార్టీ కోసం తన కుటుంబ బంధాన్ని కూడా పణంగా పెట్టుకున్నారు’’ అని మాజీ ఎంపీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని