42% రిజర్వేషన్ల సాధనకు ‘అష్టాంగ’ ఆందోళనలు

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 04:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

డిసెంబరు తొలివారంలో పార్లమెంటు ముట్టడి
బీసీ ఐకాస విస్తృతస్థాయి సమావేశంలో నేతల నిర్ణయం 

ఐక్యత చాటుతున్న సురేష్, జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఆర్‌.నారాయణమూర్తి, ఈటల, వీహెచ్, అయిలయ్య, జూలూరు గౌరీశంకర్, ప్రభాకర్‌ తదితరులు

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 6 నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు బీసీ ఐకాస నేతలు వెల్లడించారు. వచ్చే 3 నెలలపాటు గల్లీ నుంచి దిల్లీ వరకు 8 రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందుకు గౌతమ బుద్ధుడి స్ఫూర్తితో ‘అష్టాంగ’ ఆందోళనలుగా నామకరణం చేశామని తెలిపారు. బీసీ ఉద్యమ కార్యాచరణపై ఆదివారం బంజారాహిల్స్‌లోని కళింగ భవనంలో ఐకాస, పలు పార్టీల నేతల రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం బీసీ ఐకాస వర్కింగ్‌ ఛైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగింది. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఈ ఉద్యమంతో బీసీలందరికీ తెలంగాణ దిక్సూచిగా మారనుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో క్రమంగా ఐక్యత పెరుగుతోందన్నారు. ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో, ప్రత్యేక తెలంగాణలో ఇప్పటివరకు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టేలా ఎంపీలపై ఒత్తిడి తేవాలని సూచించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. ఉద్యమాలకు దళితుల నుంచి మద్దతు ఉంటుందని, వ్యక్తిగతంగా కాకుండా బీసీ సమాజం కోసం పోరాడినప్పుడే రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఐకాసను సమర్థంగా నిర్వహించాలని, సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. సమావేశంలో బీసీ ఐకాస కోఛైర్మన్‌ దాసు సురేశ్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్, మాజీ ఐఏఎస్‌ చొల్లేటి ప్రభాకర్, ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్, సినీ దర్శకులు ఆర్‌.నారాయణమూర్తి, ఎన్‌.శంకర్, 90 బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఇదీ కార్యాచరణ.. 

నవంబరు 6న రాష్ట్రవ్యాప్తంగా ఫులే విగ్రహాల ముందు బీసీల మౌన దీక్ష, 13న సామాజిక న్యాయ సాధనకు పల్లె నుంచి పట్నం వరకు ‘బీసీల ధర్మ పోరాట దీక్షలు, 16న రన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎంపీలపై ఒత్తిడి పెంచడానికి 18న ఎంపీలతో బీసీల ములాఖత్, 23న అఖిలపక్ష పార్టీల సమావేశం, డిసెంబరు మొదటివారంలో బీసీల చలో దిల్లీ, పార్లమెంటు ముట్టడి, మూడోవారం నుంచి పల్లె నుంచి పట్నం వరకు బస్సుయాత్ర, జనవరి నాలుగోవారంలో చలో హైదరాబాద్, వేల వృత్తులు-కోట్ల గొంతులు పేరుతో భారీ బహిరంగ సభ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు