నీరు లేక.. పరిశోధనలు సాగక

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 05:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

11 ఏళ్లుగా నిస్తేజంగా సర్‌ రోనాల్డ్‌ రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారాసైటాలజీ 

ఈనాడు, హైదరాబాద్, బేగంపేట, న్యూస్‌టుడే: దోమల నియంత్రణపై పరిశోధనలు కొనసాగించే హైదరాబాద్‌ బేగంపేటలోని సుప్రసిద్ధ సర్‌ రోనాల్డ్‌ రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారాసైటాలజీకి ఏళ్లుగా నీటి సమస్య తీరడం లేదు. ఈ సంస్థకు భవనాన్ని ఉచితంగా ఇచ్చిన ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు పదకొండేళ్ల కిందట తాగునీటి కనెక్షన్‌ను తొలగించడంతో అరకొర పరిశోధనలతోనే సరిపెట్టుకుంటున్నారు. సంస్థ నిర్వహణ బాధ్యత ఉస్మానియా వర్సిటీ చూస్తుండగా మలేరియా, డెంగీ, గన్యా జ్వరాలకు కారణాలవుతున్న దోమలపై ఉస్మానియా ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. బేగంపేటలోని సంస్థకు ఇచ్చిన తాగునీటి కనెక్షన్‌ ద్వారా సమీపంలోని కొన్ని ఇళ్ల యజమానులు నీళ్లు తీసుకుంటున్నారన్న అనుమానంతో పదకొండేళ్ల క్రితం ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు కనెక్షన్‌ను తొలగించారు. దీనిపై ఉస్మానియా ఆచార్యులు ఎయిర్‌పోర్ట్‌ అధికారులను అడగ్గా.. తాగునీటి కనెక్షన్‌ ఇవ్వాలంటే దిల్లీలోని అధికారులకు లేఖ రాయాలని చెప్పారు. పదకొండేళ్ల నుంచి ఆచార్యులు విన్నవిస్తున్నా స్పందన ఉండడం లేదు. పరిశోధనలు, ఇతర అవసరాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. దీంతో అప్పటి నుంచి అనుకున్న స్థాయిలో పరిశోధనలు లేవు. నీటి కనెక్షన్‌ ఇవ్వాలంటూ జలమండలి అధికారులను కోరగా... భవన యజమానిగా మీ సంస్థ పేరుంటే ఇస్తామని తేల్చి చెప్పారని సర్‌ రోనాల్డ్‌ రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారాసైటాలజీ సంచాలకులు ప్రొ.రెడ్యానాయక్‌ వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపితే సమస్య పరిష్కారమవుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు