ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు ఏరియల్‌ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ సర్వే

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 05:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మన్నెవారిపల్లిలో నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
మొంథా తుపాను నష్టంపై ఏరియల్‌ సర్వే చేపట్టనున్న ముఖ్యమంత్రి

ఏరియల్‌ ఎలక్ట్రోమ్యాగ్నెట్‌ సర్వే ఇలా నిర్వహిస్తారు..

ఈనాడు, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌- అచ్చంపేట న్యూటౌన్, న్యూస్‌టుడే: నిపుణుల సూచనల మేరకు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ కోసం నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తల ఆమోదం మేరకు ‘హెలిబోర్న్‌ ఏరియల్‌ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ సర్వే’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వేను నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్నెవారిపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్తారు. మన్నెవారిపల్లి వద్దనున్న ఎస్‌ఎల్‌బీసీ ఔట్‌లెట్‌ టన్నెల్‌ను ఆయన పరిశీలించడంతో పాటు మొంథా తుపాను వల్ల నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లిన ప్రాంతాలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. ఇటీవలి వర్షాలకు ఇళ్లు ముంపునకు గురైన మర్లపాడు తండాకు చెందిన గిరిజనులతో సీఎం మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఈ పర్యటనలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొననున్నారు. 

మన్నెవారిపల్లి వైపు టన్నెల్‌

 

200 కి.మీ.కు పైగా ఏరియల్‌ సర్వే

ఎన్‌జీఆర్‌ఐ డెరెక్టర్‌ డాక్టర్‌ ప్రకాశ్‌కుమార్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ హెచ్‌వీఎస్‌ సత్యనారాయణ పర్యవేక్షణలో 200 కిలోమీటర్లకు పైగా హెలిబోర్న్‌ ఏరియల్‌ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ సర్వే నిర్వహించనున్నారు. ఇందులో విద్యుదయస్కాంత సంకేతాలను భూమిలోకి పంపి ప్రకంపనలను సృష్టిస్తారు. ఇవి పరావర్తనం చెందుతాయి. ఆ వివరాలు చిన్న రిసీవర్‌ లూప్‌లో నమోదవుతాయి. వీటిని విశ్లేషించి... భూగర్భంలో 800-1000 మీటర్ల లోతులో షియర్‌ జోన్‌లు లేదా నీటి ప్రవాహాలు ఉంటే గుర్తిస్తారు. తద్వారా సరైన తవ్వకం విధానాలను చేపట్టేందుకు వీలు పడుతుంది. ఎన్‌జీఆర్‌ఐ బృందం ఓ హెలికాప్టర్‌లో, సీఎం మరో హెలికాప్టర్‌లో మన్నెవారిపల్లె నుంచి దోమలపెంట ఇన్‌లెట్‌ వరకు పరిశీలించనున్నారు. 2009 అక్టోబరులో వచ్చిన అనూహ్య వరద, ఈ ఏడాది ఫిబ్రవరిలో కప్పు కూలిన ఘటనల కారణంగా టన్నెల్‌ నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. 2028 సంవత్సరం అర్ధభాగంలోగా.. టన్నెల్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏరియల్‌ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ సర్వే నిర్వహిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు