TG News: కృష్ణా నీటి వాటాల పాపం భారాసదే: మంత్రి ఉత్తమ్‌

Eenadu icon
By Telangana News Team Updated : 17 Jan 2025 20:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: నీటి వాటాల పాపం భారాసదేనని, పదేళ్ల పాటు తెలంగాణకు తీరని ద్రోహం చేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలను పదేళ్లుగా పట్టించుకోని భారాస నేతలు ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆక్షేపించారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలు వాడుకునేలా ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని విమర్శించారు.

భారాస ప్రభుత్వం చేసుకున్న చీకటి ఒప్పందంతోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్న ఆయన.. తాత్కాలిక కేటాయింపులపై ప్రతి ఏడాది సంతకాలు చేసింది భారాస నేతలు కాదా? అని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా రావాలనే వాదనను లేవనెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయంలో భారాస ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నిలదీసినందుకే సెక్షన్‌ (3) అంశం తెరపైకి వచ్చిందన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం టర్మ్స్‌ ఆఫ్ రిఫరెన్స్‌కు ఓకే చెప్పిందని పేర్కొన్నారు. ఇందులో భారాస గొప్పతనమేమీ లేదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ నిర్దిష్ట కాల వ్యవధిలో కేటాయింపులు జరిగేలా గడిచిన పదేళ్లలో ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్రిజేశ్‌ కుమార్ ట్రైబ్యునల్ ద్వారా త్వరగా నీటి కేటాయింపులు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచినట్లు వివరించారు. భారాస హయాంలోనే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలించిందని, పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని అదనంగా మరో 44 వేల క్యూసెక్కులకు పెంచిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల, 80 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఏపీ అనుమతులు జారీ చేస్తే భారాస ప్రభుత్వం ఎందుకు చూసీ చూడనట్లు వ్యవహరించిందని ఆరోపించారు.

Tags :
Published : 17 Jan 2025 20:53 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని