Published : 08/12/2021 04:45 IST

హక్కుపత్రాలు లేకుండా కొనుగోలు చేశారు

జమునా హేచరీస్‌ భూమి వ్యవహారంపై మెదక్‌ కలెక్టర్‌ హరీష్‌

మెదక్‌, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో సర్వే నంబరు 81లో 5.36 ఎకరాలు, సర్వే నంబరు 130 లో 3 ఎకరాల భూమిని జమున హేచరీస్‌ యాజమాన్యం కబ్జా చేసిందని, పూర్తి స్థాయి సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని కలెక్టర్‌ హరీష్‌ స్పష్టం చేశారు. ఆ భూములను తాము న్యాయబద్ధంగా కొనుగోలు చేసి ధరణిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నామన్న ఈటల జమున ప్రకటనపై ఆయన మంగళవారం వివరణ ఇచ్చారు. అచ్చంపేటలో సర్వే నం.130లో 18.35 ఎకరాల స్థలాన్ని సీలింగ్‌ మిగులు భూమిగా ప్రకటించి 1990లో 11 మంది పేదలకు కేటాయించారన్నారు. ఈ సర్వే నంబర్‌లో 3 ఎకరాలను ఎలాంటి హక్కులు లేని రామారావు నుంచి కొనుగోలు చేశారని అన్నారు. సర్వే నంబరు 130లో సీలింగ్‌ మిగులు భూమిపై రిజిస్ట్రేషన్‌ శాఖ 2007లో నిషేధం విధించిందని, అందులో వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. సర్వే నంబరు 130లో అసైన్డ్‌దారుల నుంచి జమునా హేచరీస్‌ అక్రమంగా కొనుగోలు చేసి తెల్లకాగితంపై లావాదేవీలు నిర్వహించినట్లు తమ వద్ద రికార్డులు ఉన్నాయన్నారు. అచ్చంపేటలో ఎసైన్డ్‌భూమిని జమున హేచరీస్‌ యాజమాన్యం ఆక్రమించుకుందని తెలిపారు.

సర్వే నంబరు.81లో 16.19 ఎకరాల స్థలంలో 14.05 ఎకరాలను మిగులు భూమిగా ప్రకటించి పేదలకిచ్చారని పాలనాధికారి తెలిపారు. ఈ సర్వే నంబరులో కూడా 5.36 ఎకరాలను రామారావు నుంచి కొనుగోలు చేశారని పేర్కొన్నారు. సర్వే నం.81, 130లో 8.36 ఎకరాలను ధరణి ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామని జమున పేర్కొనడం సరికాదని, ధరణి గతేడాది నవంబర్‌ నుంచి మాత్రమే అమల్లో ఉందని, అంతకు ముందే అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని కలెక్టర్‌ స్పష్టంచేశారు.


‘ఈటల క్షమాపణలు చెప్పాలి’

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ, ఎస్సీ, ఎస్టీ భూములను ఈటల రాజేందర్‌ కబ్జా చేశారని నిగ్గు తేలిందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. మెదక్‌ కలెక్టర్‌ ఆధారాలతో సహా చూపించారన్నారు. 71 ఎకరాల పేదల భూములు లాక్కున్న ఈటల తప్పయిందని 71 సార్లు ముక్కు నేలకు రాయాలని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిజాలు బయటపడినా ఈటల అభాండాలు వేసేందుకు, నిజాయితీగా పని చేస్తున్న కలెక్టర్‌ను భయపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  మంగళవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో సుమన్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని’’  సుమన్‌ అన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని