పసికందులకు ఆరోగ్యమస్తు

ఏడాదిలోపు వయసున్న శిశు మరణాల రేటు(ఇన్‌ఫాంట్‌ మోర్టాలిటీ రేట్‌-ఐఎంఆర్‌) రాష్ట్రంలో గడిచిన ఏడేళ్లలో గణనీయంగా తగ్గింది. 2014లో ప్రతి వేయి జననాలకు ఏడాదిలోపు శిశువులు 39 మంది మృతి చెందగా.. గురువారం వెలువడిన 2020 గణాంకాల్లో

Published : 27 May 2022 05:14 IST

తెలంగాణలో తగ్గిన శిశు మరణాల రేటు
2020 గణాంకాల్లో 21 నమోదు
జాతీయ సగటు కంటే తక్కువే
ఎస్‌ఆర్‌ఎస్‌ సర్వే తాజా నివేదికలో వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌

ఏడాదిలోపు వయసున్న శిశు మరణాల రేటు(ఇన్‌ఫాంట్‌ మోర్టాలిటీ రేట్‌-ఐఎంఆర్‌) రాష్ట్రంలో గడిచిన ఏడేళ్లలో గణనీయంగా తగ్గింది. 2014లో ప్రతి వేయి జననాలకు ఏడాదిలోపు శిశువులు 39 మంది మృతి చెందగా.. గురువారం వెలువడిన 2020 గణాంకాల్లో 21కి తగ్గింది. 2019తో పోల్చితే 2 పాయింట్లు తగ్గడం విశేషం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘నమూనా నమోదు విధానం(శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌-ఎస్‌ఆర్‌ఎస్‌)’ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమాచారాన్ని పొందుపర్చింది. శిశు మరణాల రేటుతో పాటు జనన, మరణాల రేటు, సహజ వృద్ధి రేటు తదితర సమాచారాలనూ అందించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో 121, పట్టణాల్లో 103 చొప్పున మొత్తంగా 224 కేంద్రాల్లో నమూనాలను సేకరించారు. వీటిలో గ్రామీణ తెలంగాణలో 1.58 లక్షల జనాభాను, పట్టణాల్లో 0.56 లక్షల జనాభా కలుపుకొని మొత్తం 2.14 లక్షల జనాభా నుంచి ఈ నమూనాలను నమోదు చేశారు. శిశు మరణాల రేటులో జాతీయ సగటు(28) కంటే తెలంగాణ(21)లో తక్కువగా నమోదవడం విశేషం.

గ్రామీణంలో ఎక్కువే
రాష్ట్రంలో శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టినా.. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణంలో ఎక్కువ మరణాలే జరుగుతున్నట్లు ఎస్‌ఆర్‌ఎస్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ తెలంగాణలో ప్రతి వేయి జననాలకు కొన్ని జిల్లాల్లో కనిష్ఠంగా 19, గరిష్ఠంగా కొన్ని జిల్లాల్లో 30 వరకూ శిశు మరణాలు చోటుచేసుకున్నట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కనిష్ఠంగా 9, గరిష్ఠంగా 25 వరకూ సంభవించాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే.. కనిష్ఠంగా 17, గరిష్ఠంగా 26 మరణాలు సంభవించాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ వైద్యంపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. శిశు మరణాల్లో బాలురు, బాలికల నిష్పత్తి 21:22గా నమోదైంది. రాష్ట్రంలో ఏటా సుమారు 63 వేల నుంచి 93 వేల మంది శిశువులు ముందస్తుగా లేదా తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. ఇలా పుట్టిన పిల్లల్లో ఇన్‌ఫెక్షన్లు సోకడానికి అవకాశాలెక్కువ. దీన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 32 నవజాత శిశు సంరక్షణ కేంద్రాల(ఎస్‌ఎన్‌సీయూ)ను నెలకొల్పింది. వీటిలో ఏటా సుమారు 50-60 వేల మంది నవజాత శిశువులు చికిత్స పొందుతుండగా.. వీరిలో సుమారు 77 శాతం మంది క్షేమంగా బయటపడుతున్నారు. ఎస్‌ఎన్‌సీయూల అత్యుత్తమ సేవల ఫలితంగానూ, కేసీఆర్‌ కిట్‌ అమలుతో తల్లీబిడ్డ సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన ఫలితంగానూ.. మొత్తంగా శిశు మరణాల రేటు తగ్గిందని వైద్యవర్గాలు విశ్లేషించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని