నిలిచిపోయిన ఎన్‌టీఎస్‌ పరీక్ష

దేశంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష(ఎన్‌టీఎస్‌ఈ) బ్రేక్‌ పడింది. కేంద్ర విద్యాశాఖ నుంచి ఆమోదం లభించే వరకు దాన్ని నిలిపివేస్తున్నట్లు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) ప్రకటించింది.

Updated : 08 Oct 2022 06:02 IST

2021 మార్చి వరకే కేంద్రం ఆమోదం
మళ్లీ అనుమతిచ్చే వరకు పరీక్ష లేనట్లేనని ప్రకటించిన ఎన్‌సీఈఆర్‌టీ

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష(ఎన్‌టీఎస్‌ఈ) బ్రేక్‌ పడింది. కేంద్ర విద్యాశాఖ నుంచి ఆమోదం లభించే వరకు దాన్ని నిలిపివేస్తున్నట్లు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) ప్రకటించింది. పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో పరీక్ష నిర్వహించి చివరకు 2వేల మందికి కేంద్ర ప్రభుత్వం ఉపకారవేతనం అందజేస్తుంది. గత ఏడాది ఎన్‌టీఎస్‌ఈ-2021 నిర్వహిస్తామని ఎన్‌సీఈఆర్‌టీ ప్రకటించడంతో ఆయా రాష్ట్రాలు రాష్ట్రస్థాయి పరీక్ష కోసం విద్యార్థుల నుంచి రుసుములు వసూలు చేశాయి. గత జనవరిలో పరీక్ష జరపాల్సి ఉండగా.. దాన్ని నిలిపివేయాలని ఆనాడు ఎన్‌సీఈఆర్‌టీ నుంచి అకస్మాత్తుగా ఆదేశాలు వచ్చాయి. అప్పటి నుంచి పరీక్ష నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పరీక్షకు 2021 మార్చి వరకే ఆమోదం ఉందని, తర్వాత పరీక్షల నిర్వహణకు అది ఇంకా రాలేదని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది. అందువల్ల మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు పరీక్షను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంటే 2021కు పరీక్ష ఇక లేనట్లే. సాధారణంగా ఏటా ఆగస్టు/సెప్టెంబరులో నోటిఫికేషన్‌ ఇచ్చి నవంబరు తొలి ఆదివారం రాష్ట్రస్థాయి పరీక్ష జరుపుతారు. ప్రతిభ చూపినవారికి జాతీయస్థాయి పరీక్షను మే రెండో ఆదివారం నిర్వహిస్తారు. అక్టోబరు వచ్చినా ఇప్పటివరకు నోటిఫికేషన్‌ రానందున 2022కు కూడా పరీక్ష లేనట్లేనని భావిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులేమో 2021 మార్చి వరకే పరీక్షకు అనుమతి ఉన్నప్పుడు గత ఏడాది పరీక్ష జరపాలని నోటిఫికేషన్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. పోయిన ఏడాది తెలంగాణలో దాదాపు 14వేల మంది నుంచి వసూలు చేసిన ఫీజులను వెనక్కి ఇస్తారా? లేదా? అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని