విశ్వవిద్యాలయాలకు నిధులు వచ్చేనా!

కొన్ని విశ్వవిద్యాలయాల్లో కళాశాలలకు భవనాలు లేవు.. మరికొన్నింటికి భవనాలున్నా శిథిలావస్థకు చేరుతున్నాయి.. దాదాపు అన్ని వర్సిటీల్లో తగినంతగా హాస్టళ్లు లేవు.

Published : 06 Feb 2023 04:09 IST

తీవ్రంగా మౌలిక వసతుల కొరత
అభివృద్ధి నిధులకు భారీగా ప్రతిపాదించిన వర్సిటీలు
రాష్ట్ర బడ్జెట్‌పై ఆశలు

ఈనాడు, హైదరాబాద్‌: కొన్ని విశ్వవిద్యాలయాల్లో కళాశాలలకు భవనాలు లేవు.. మరికొన్నింటికి భవనాలున్నా శిథిలావస్థకు చేరుతున్నాయి.. దాదాపు అన్ని వర్సిటీల్లో తగినంతగా హాస్టళ్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. కొన్ని వర్సిటీలు రూ.వందల కోట్లతో ప్రతిపాదనలు సమర్పించాయి. మౌలిక వసతులు కల్పించకుంటే విద్యార్థుల నిత్య ఆందోళలు తప్పేలా లేవని వర్సిటీ అధికారులు ఆర్థిక, విద్యాశాఖ ఉన్నతాధికారుల వద్ద వాపోతున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

రెండేళ్లు కేటాయించినా.. విడుదల అంతంతే!

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విశ్వవిద్యాలయాలకు అభివృద్ధి పనులకు గాను.. 2017-18, 2018-19 సంవత్సరాలకు నిధులను బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది. 2017-18లో 8 విశ్వవిద్యాలయాలకు రూ.420 కోట్లు, 2018-19లో రూ.210 కోట్లు కేటాయించినా.. విడుదల చేసిన నిధులు సగం కూడా మించలేదు. 2017-18లో పాలమూరు వర్సిటీకి కేటాయించిన రూ.40 కోట్లలో రూ.12 కోట్లే విడుదల కాగా.. 2018-19లో రూ.20 కోట్లకు గాను రూపాయి కూడా ఇవ్వలేదు. 2017-18లో ఓయూకు రూ.200 కోట్లు కేటాయించినా చివరకు రూ.50 కోట్లే అందాయి. 2018-19లో కూడా రూ.60 కోట్లు ప్రకటించినా ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఇక ఆ తర్వాత నాలుగేళ్లుగా (2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి) అసలు మంజూరు చేయలేదు.

విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల పరిస్థితి దారుణంగా మారింది. గత ఏడాది నిజాం కళాశాలలో హాస్టల్‌ వసతి కోసం డిగ్రీ విద్యార్థినులు రోజుల తరబడి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. కోఠి మహిళా కళాశాలలోను; ఓయూ, కాకతీయ, పాలమూరు తదితర వర్సిటీల్లోను హాస్టళ్లు తక్షణ అవసరంగా మారాయి. ఈ నేపథ్యంలో కనీసం రూ.200 కోట్లు వంతున నిధులు కావాలని ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు ప్రతిపాదనలు సమర్పించాయి.

దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు కావడంతో శిథిలావస్థలో ఉన్నాయని, కొత్త భవనాలు, ప్రయోగశాలలు నిర్మించాలని ఓయూ కోరింది. జేఎన్‌టీయూహెచ్‌ కింద సిరిసిల్లలో 2021-22, వనపర్తిలో 2022-23 విద్యా సంవత్సరాల నుంచి కొత్తగా ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రారంభమయ్యాయి. ఈ రెండూ తాత్కాలికంగా డిగ్రీ కళాశాలల్లో నడుస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్‌ మహబూబాబాద్‌, ఖమ్మంలకు ఇంజినీరింగ్‌ కళాశాలలను మంజూరు చేశారు. ఈక్రమంలో రూ.500 కోట్లు మంజూరు చేయాలని జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు ప్రతిపాదించారు. తెలుగు వర్సిటీ కూడా వన్‌టైం గ్రాంట్‌ కింద రూ.10 కోట్లు ప్రతిపాదించింది.

వేతనాలకూ అరకొరే..

ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 11 వర్సిటీలకు కలిపి వేతనాల కోసం 2021-22 బడ్జెట్‌లో బ్లాక్‌గ్రాంట్‌ రూపేణా రూ.617.36 కోట్లు ఇవ్వగా.. 2022-23కు రూ.759.37 కోట్లు కేటాయించారు. అంటే రూ.142 కోట్లు మాత్రమే అధికం. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) కోసం వర్సిటీలు ఈ బ్లాక్‌గ్రాంట్‌ను భారీగా పెంచాలని కోరుతున్నాయి. ఒక్క ఓయూ మాత్రమే సిబ్బంది జీతాలు, పింఛన్లు కోసం రూ.800 కోట్లు ప్రతిపాదించింది. అంటే గత బడ్జెట్‌లో 11 వర్సిటీలకు కలిపి ఇచ్చిన నిధుల కంటే ఎక్కువ. వాస్తవానికి ఉస్మానియా వర్సిటీకి శాశ్వత ఉద్యోగుల వేతనాలకే రూ.382 కోట్లు, పింఛన్లకు రూ.285 కోట్లు అవసరమవుతాయని గత ఏడాది ఓయూ వీసీ రవీందర్‌ అప్పట్లో సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్‌ సమక్షంలోనే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇక ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు చేసే చెల్లింపులు అదనం. గతేడాది మొత్తం రూ.789 కోట్లు అడిగినా చివరకు ఓయూకు దక్కింది రూ.418 కోట్లే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని