Telangana rains: ముంచెత్తింది.. కుండపోత వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం

అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా.. కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో కురిసిన భారీ వానలు బీభత్సం సృష్టించాయి.

Updated : 26 Jul 2023 08:13 IST

నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు..
వేల్పూర్‌లో గరిష్ఠంగా 46.3 సెంటీమీటర్ల వర్షపాతం
రాష్ట్ర చరిత్రలో ఇది మూడో అత్యధికం
ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగానూ కుంభవృష్టి
పొంగిన వాగులు, తెగిన రహదారులతో స్తంభించిన రాకపోకలు
పలు చెరువులకు గండ్లు.. లక్ష ఎకరాలకుపైగా పంట నష్టం
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇద్దరు యువతుల మృతి
నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు

ఈనాడు-హైదరాబాద్‌, నిజామాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా.. కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో కురిసిన భారీ వానలు బీభత్సం సృష్టించాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు 46.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 4.39 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చెరువులు అలుగులు పోశాయి. నిజామాబాద్‌ జిల్లాలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. రోడ్లు తెగిపోయాయి. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో వరద పోటెత్తడంతో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. వర్షాలతో పలు జిల్లాల్లో పంటపొలాలు నీట మునిగాయి. ఇసుకమేటలు వేశాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో వాగులో పడి ఇద్దరు యువతులు మరణించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురానికి చెందిన ఓ గిరిజనుడు చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. హైదరాబాద్‌ నగరంలోని ఐటీ కారిడార్‌లో భారీ వర్షాలకు ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడకుండా నివారించేందుకు కార్యాలయాలకు మూడు వేర్వేరు లాగౌట్‌(కార్యాలయాలు ముగించే) సమయాలను సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. మరోవైపు వచ్చే మూడు రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో బుధ, గురువారాలు రెండు రోజులపాటు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖ జీవో విడుదల చేసింది.

రోజంతా వానే..

నిజామాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, జనగామ, సిద్దిపేట, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో 6.4 నుంచి 20.4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. సిరిసిల్ల, జగిత్యాల, మేడ్చల్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాల్లోనూ ధాటిగా వర్షాలు పడ్డాయి.

వేల్పూర్‌లో 6 గంటల్లోనే 46.3 సెం.మీ

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో 46.3 సెం.మీ, ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌లో 33.1, భీమ్‌గల్‌లో 26.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తాజా వర్షానికి జిల్లాలో మొత్తం 7 చెరువులు దెబ్బతిన్నాయి. వేల్పూర్‌లోని మర్సుకుంట చెరువు, కాడి చెరువులతో పాటు పచ్చలనడ్కుడ, జానకంపేట, పడగల్‌ నవాబ్‌ చెరువుల కట్టలు తెగిపోయాయి. పచ్చలనడ్కుడ చెరువు తెగి వరద ప్రవాహానికి ఆర్‌ అండ్‌ బీ రోడ్డు అయిదడుగుల లోతుతో కోతకు గురైంది. పడగల్‌ చెరువు తెగటంతో అక్కడి రోడ్డు కూడా భారీగా దెబ్బతింది. ఇదే మండలంలోని వెంకటాపూర్‌-కోమన్‌పల్లి రోడ్డు కొట్టుకుపోయింది. అంక్సాపూర్‌-పోచంపల్లి మధ్య మత్తడి వాగు పొంగి ప్రవహించటంతో రహదారి కోతకు గురైంది. పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల్పూర్‌లో సోమవారం అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ప్రజలను పంచాయతీ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక మదర్సాలోని 40 మంది పిల్లలను సమీపంలోని షాదీఖానాలోకి తరలించారు. ఆర్మూర్‌ మండలం చేపూర్‌, వేల్పూర్‌ మండలం లక్కోర గ్రామాల మధ్య జాతీయ రహదారి-63 కోతకు గురై.. రాత్రివేళ రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్మూర్‌ సమీపంలోని పెర్కిట్‌ వద్ద రహదారి, స్థానిక రైల్వే స్టేషన్‌కు వెళ్లే అప్రోచ్‌ రోడ్డు, ఆర్మూర్‌ మండలం మంథని-పిప్రి మధ్యలోని ఆర్‌ అండ్‌ బీ రోడ్డు, జక్రాన్‌పల్లి మండలంలోని తొర్లికొండ-మనోహరాబాద్‌ మధ్య పంచాయతీరాజ్‌ రోడ్డు దెబ్బతిన్నాయి. వేల్పూర్‌, ఆర్మూర్‌ మండలాల్లో పలు పాత, మట్టి ఇళ్లు కూలాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్వగ్రామమైన వేల్పూర్‌లో భారీ నష్టం వాటిల్లింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులతో కలిసి మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నిజామాబాద్‌ జిల్లాలో 5,498 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని.. 43 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 14 పంచాయతీ, 6 ఆర్‌ అండ్‌ బీ రోడ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో...

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విస్తారంగా వానలు కురిశాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురానికి చెందిన ఓ గిరిజనుడు చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై పంథిని వద్ద వరద పోటెత్తడంతో సుమారు 12 గంటలపాటు ఆరు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత నీటి ప్రవాహం తగ్గడంతో వాహనాలను అనుమతించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం ధర్మపురంలో పిడుగుపాటుకు 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వరంగల్‌ నగరంలో పలు లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఎస్సార్‌నగర్‌, సాయిగణేశ్‌ కాలనీ, వివేకానంద కాలనీ, ఎంహెచ్‌ నగర్‌, శివనగర్‌లలో ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది. వరదల్లో చిక్కుకున్నవారిని ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

  • పెద్దపల్లి జిల్లా రామగుండం బీ-పవర్‌హౌస్‌ వద్ద బూడిద చెరువు కట్ట తెగిపోయి సమీప ఇళ్లలోకి వరద చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు.
  • వేములవాడ మూలవాగు వద్ద ప్రమాదవశాత్తు జారి పడిన వ్యక్తిని పోలీసులు రక్షించారు.
  • మంథని మండలం కాకర్లపల్లిలో భారీ వర్షంతో వరద ఉద్ధృతి పెరిగి ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో కాలువలో పడింది. స్థానికులు వెంటనే ఆటోను బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది.
  • జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రంగారావుపేట శివారులో నిర్మాణ దశలో ఉన్న కల్వర్టు పక్క రోడ్డు కొట్టుకుపోయింది. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్‌-వెంకటరావుపేట గ్రామాల మధ్య ఉన్న రోడ్డు పెంటివాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది. కరీంనగర్‌ జిల్లాలో పిడుగుపాటుకు ఒక ఇల్లు ధ్వంసమైంది.
  • వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ జీవంగి వాగులో మహాలింగేశ్వరస్వామి ఆలయం సగం మునిగింది.
  • మహబూబాబాద్‌ జిల్లాలో మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి వాగులు, పెద్దపల్లి జిల్లాలో జూలపల్లి మండలం వడ్కాపురం ధూళికట్టకు వెళ్లే దారిలో హుసెన్‌మియావాగు, కాల్వశ్రీరాంపూర్‌ మండలం జాఫర్‌ఖాన్‌పేట వెన్నంపల్లి మధ్య ఉన్న మద్దుల వాగు, సిద్దిపేట జిల్లాలో మోయతుమ్మెద వాగు, తొర్రూరు మండలం గుర్తూరు పెద్దచెరువు ఉద్ధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
  • వరంగల్‌లో జలమయమైన ఎనుమాముల, ఎస్సార్‌నగర్‌ ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పర్యటించారు. ఇళ్లలోకి నీరు చేరినవారిని పునరావాస కేంద్రానికి తరలించేలా చర్యలు చేపట్టారు.

మూడో అత్యధిక వర్షపాతం

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో కురిసిన 43.1 సెంటీమీటర్ల వర్షం.. తెలంగాణ చరిత్రలో మూడో అత్యధిక వర్షపాతం. ఇప్పటివరకు అత్యధికంగా ములుగు జిల్లా వాజేడులో 2013 జులై 19న 51.75 సెంటీమీటర్లు, కుమురం భీం జిల్లా దహేగాంలో 2013 జులై 23న 50.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2016 సెప్టెంబరు 24న నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో 39.5 సెంటీమీటర్లు కురిసింది.

హైదరాబాద్‌లో...

భారీ వర్షంతో హైదరాబాద్‌ నగరంలోని రహదారులు జలయమమయ్యాయి. వరదనీటి, మురుగునీటి కాలువలు పొంగిపొర్లాయి. సైదాబాద్‌, సింగరేణి ఆఫీసర్స్‌ కాలనీ, కోదండరాంనగర్‌, సరూర్‌నగర్‌, గాజుల రామారంలోని పలు కాలనీల్లో నీరు చేరింది. రహదారులపై నీటి ప్రవాహంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. చార్మినార్‌ వద్ద 7.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

పురపాలకశాఖ కంట్రోల్‌ రూమ్‌

భారీ వర్షాల నేపథ్యంలో పురపాలకశాఖ డైరెక్టరేట్‌లోని ప్రజారోగ్య విభాగంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఈ నెల 28 వరకు మూడు షిఫ్టుల్లో 24 గంటలూ అధికారులు అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.


నీట మునిగిన 1.05 లక్షల ఎకరాలు!

భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఎకరాల్లో పంటపొలాలు మునిగాయని అధికారులు అంచనా వేశారు. 62 వేల ఎకరాల్లో పత్తి, 19 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 15 వేల ఎకరాల్లో కంది, 5 వేల ఎకరాల్లో వేరుసెనగ, 4 వేల ఎకరాల్లో సోయాబీన్‌ చేలల్లోకి నీరు చేరింది.


వాగు దాటుతూ ఇద్దరు యువతుల మృత్యువాత

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: పొలానికి వెళ్లేందుకు వాగు దాటుతున్న ఇద్దరు యువతులు నీట మునిగి మృతిచెందారు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం కొండేడు గ్రామానికి చెందిన పడకంటి అనూష(19), పడకంటి స్వాతి(17) దాయాదుల కుమార్తెలు. మంగళవారం వారిద్దరూ కలిసి అనూష వాళ్ల పొలంలో కలుపుతీసేందుకు బయలుదేరారు. గ్రామ శివారులో ఊకవాగును దాటుతున్న క్రమంలో బండరాయిపై నుంచి జారి నీటిలో పడ్డారు. అక్కడ ఇసుక కోసం తవ్విన భారీ గుంత ఉండటంతో నీటిలో మునిగిపోయారు. ఇద్దరికీ ఈత రాదు. వారి కోసం గాలింపు చేపట్టగా.. కొంతదూరంలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.


ఆదివాసీ... ప్రసవ వేదన

10 కి.మీ. జెట్టీలో మోసుకొచ్చిన గ్రామస్థులు

ఆదివాసీల జీవనానికి తిప్పలు తప్పడం లేదు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపురం జిల్లా కోటెనాం గ్రామానికి చెందిన గర్భిణికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మంగళవారం పది కిలోమీటర్ల దూరం వరకు జెట్టీలో మోసుకొచ్చారు. ఈ గ్రామం జిల్లా కేంద్రానికి 25 కి.మీ దూరంలోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో ఉంటుంది. మైదాన ప్రాంతానికి వచ్చాక ఆప్‌ జిల్లా అధ్యక్షుడు బాకుల్‌ వాహి వాహనం సమకూర్చగా... గ్రామస్థులు ఆమెను నారాయణపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు.  

న్యూస్‌టుడే, చర్ల


పాఠాలు నేర్వాలంటే.. జలగండాలు దాటాలి

వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట నుంచి మాంతిపూర్‌ వెళ్లే దారిలోని కాకరవాణి వాగు ఏటా వర్షాకాలంలో నిండుగా పారుతుంది. ఇక్కడ కనీసం కాలినడక వంతెననైనా నిర్మించకపోవడంతో.. మాంతిపూర్‌ నుంచి బొంరాస్‌పేటలోని ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఇతర పనులపై వెళ్లే గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. మంగళవారం తల్లిదండ్రులు తమ పిల్లలను వాగు దాటిస్తూ ఇలా కనిపించారు.  

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట



దేశంలోని పలు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. గ్రేటర్‌ నొయిడాలోని ఈ చిత్రం అక్కడి పరిస్థితికి దర్పణం. హిండన్‌ నది ఉప్పొంగి ఎకోటెక్‌-3 పార్కులో 5 అడుగుల మేర నీరు చేరి ఓలా డంప్‌ యార్డును ముంచెత్తింది. అందులోని దాదాపు 350 కార్లు నీట మునిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని