మా భర్తలను నేలపై కూర్చోబెట్టి అవమానించారు: హైకోర్టును ఆశ్రయించిన బాధితుల భార్యలు

పోలీసులు తమ భర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి, వారిని నేలపై కూర్చోబెట్టి విలేకరుల సమావేశం నిర్వహించారంటూ సికింద్రాబాద్‌కు చెందిన ఎస్‌.స్రవంతి యాదవ్‌, మరో ఇద్దరు మహిళలు హైకోర్టును ఆశ్రయించారు.

Updated : 16 Nov 2023 07:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసులు తమ భర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి, వారిని నేలపై కూర్చోబెట్టి విలేకరుల సమావేశం నిర్వహించారంటూ సికింద్రాబాద్‌కు చెందిన ఎస్‌.స్రవంతి యాదవ్‌, మరో ఇద్దరు మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. తమ భర్తలు నేరం చేశారంటూ ఒక కేసు వివరాలు వెల్లడించడానికి మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంలో.. మారేడుపల్లి పోలీసులు వారిని అమానవీయంగా నేలపై కూర్చోబెట్టారని, సామాజిక మాధ్యమాల్లో ఇది విస్తృతంగా ప్రచారమైందన్నారు. తమ భర్తలను వేధింపులకు గురి చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వి.సంజన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించి వస్తువులను స్వాధీనం చేసుకున్నారని, వాటిని వెనక్కి ఇప్పించాలని కోరారు. అంతేకాక ఒక కేసు నమోదు చేశారని, దాని ఆధారంగా మరో కిడ్నాప్‌ కేసు నమోదు చేసి పిటిషనర్ల భర్తలను అరెస్టు చేశారన్నారు. పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం ఇప్పించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిందితులను వేధింపులకు గురి చేయరాదని పోలీసులను ఆదేశించారు. పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను డిసెంబరు 13కు వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని