ఇక వేలంలో కొనడమే!

తెలంగాణలో కొత్త బొగ్గు గనులను దక్కించుకునేందుకు కేంద్ర బొగ్గుశాఖ నిర్వహించే వేలంలో పాల్గొనాలని సింగరేణి యోచిస్తోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో రెండు బొగ్గు గనులు ప్రైవేటు కంపెనీలు సొంతం చేసుకున్నాయి.

Published : 25 Mar 2024 05:50 IST

మరోసారి గనులను వేలం వేయనున్న కేంద్ర బొగ్గుశాఖ
టెండర్‌ వేసి దక్కించుకోవాలని సింగరేణి యోచన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త బొగ్గు గనులను దక్కించుకునేందుకు కేంద్ర బొగ్గుశాఖ నిర్వహించే వేలంలో పాల్గొనాలని సింగరేణి యోచిస్తోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో రెండు బొగ్గు గనులు ప్రైవేటు కంపెనీలు సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కేంద్ర బొగ్గుశాఖ మరోసారి కొత్త గనులను వేలం వేయడానికి సిద్ధమవుతున్నట్లు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. ఆపై గనుల వేలం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కొత్తగా మరిన్ని గనులను వేలం వేయనున్నట్లు సమాచారం. ఈ వేలంలో పాల్గొని గనులను దక్కించుకోవాలని   సింగరేణి కసరత్తు చేస్తోంది.

సింగరేణికే బొగ్గు అవసరం

తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల విద్యుదుత్పత్తి కేంద్రాలు 2.40 లక్షల టన్నుల వరకు బొగ్గు కావాలని సింగరేణిని అడుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో సింగరేణికి ఇప్పటికే 1200 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయి. అక్కడే మరో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మాణానికి సింగరేణి టెండర్లు పిలుస్తోంది. దీంతోపాటు 800 మెగావాట్ల ప్లాంటు నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్రం సింగరేణికి సూచించింది. నాలుగేళ్లలో పూర్తయ్యే ఈ రెండు ప్లాంట్లకు రోజూ 20 వేల టన్నుల బొగ్గు అవసరం. ఇవే కాకుండా రామగుండంలో ఎన్టీపీసీ 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రానికి బొగ్గు సరఫరాకు సింగరేణి తంటాలు పడుతోంది. అక్కడే అదనంగా మరో 2400 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి ఎన్టీపీసీ కసరత్తు చేస్తోంది. ఇవి పూర్తయితే రోజుకు మరో 30 వేల టన్నుల బొగ్గు సింగరేణి సరఫరా చేయాలి. ఇప్పుడున్న పాత గనుల్లో రోజువారీ ఉత్పత్తవుతున్న 2.20 లక్షల టన్నులే సరిపోక 20 వేల టన్నుల అమ్మకాలను సింగరేణి నష్టపోతోంది. ఇక కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాలు పూర్తయితే రోజూ మరో 50 వేల టన్నులకు పైగా ఎక్కడి నుంచి తేవాలనేది కీలకప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో భారీ నిల్వలున్న కొత్త గనులను వేలంలో దక్కించుకోకపోతే మరో నాలుగైదేళ్లలో తీవ్ర బొగ్గు కొరత ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థ తెలిపింది. దీనివల్ల టెండరు వేసి వేలంలో గనులను కొంటే ఉత్పత్తి పెంచగలమని వివరించింది. ఈ నేపథ్యంలో కొత్త గనులను వేలంలో కొనడానికి సింగరేణి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని