ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ

క్యాన్సర్‌ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 28 Apr 2024 05:51 IST

ఉచితంగా క్యాన్సర్‌ చికిత్స అందిస్తామని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ వెల్లడి
రూ.6.5 లక్షల వరకు సాయం అందజేసిన దాతలు
‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: క్యాన్సర్‌ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!’ శీర్షికన శనివారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించారు. వెంటనే ప్రభుత్వ ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. ఆ చిన్నారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. మంత్రి సూచన మేరకు వైద్యులు వేదవల్లి కుటుంబ సభ్యులను సంప్రదించారు. ప్రభుత్వం తరఫున ఉచితంగా చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు.

పరిమళించిన మానవత్వం..

హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లో ఉంటున్న ఎనిమిదేళ్ల వేదవల్లికి అరుదైన క్యాన్సర్‌ సోకిన సంగతి తెలిసిందే. పలు చికిత్సల కోసం ఇంతవరకు రూ.40 లక్షలు ఖర్చు చేసిన తల్లిదండ్రులు మరో రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు. చిన్నారి పరిస్థితిని ‘ఈనాడు’ ద్వారా తెలుసుకున్న దేశ విదేశాల్లో ఉంటున్న ఎంతోమంది మానవతావాదులు స్పందించారు. తామున్నామంటూ ఆపన్న హస్తం అందించారు. వేదవల్లి తండ్రి రఘుకు ఫోన్‌చేసి చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీశారు. శనివారం సాయంత్రం వరకు వేదవల్లి వైద్య ఖర్చుల కోసం వారంతా రూ.6.5 లక్షల వరకు సాయం అందించారు. అమెరికా నుంచి ఎన్‌ఆర్‌ఐ ఒకరు రూ.1,00,016 పంపించారు. అలాగే వీరేంద్ర నల్లపనేని, డి.సంతోష్‌, శ్రీకాంత్‌ సూరిపెద్ది రూ.50 వేల చొప్పున సాయం చేశారు. అమ్మినేని వంశీకృష్ణ రూ.36 వేలు, శేష్‌కుమార్‌ పర్లప రూ.25 వేలు, మురళి కొర్రపాటి, కందిబండ సుధీర్‌ రూ.20 వేల వంతున సాయం చేశారు. వీరితోపాటు పలువురు రూ.10 వేల చొప్పున, మరికొందరు తమకు తోచినంత ఆర్థికసాయం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని