అరగంట కరెంట్‌ కట్‌.. కీసర డీఈపై సస్పెన్షన్‌ వేటు

అరగంట కరెంట్‌ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్‌లోని హబ్సిగూడ సర్కిల్‌ కీసర డివిజనల్‌ ఇంజినీర్‌ (డీఈ) ఎల్‌.భాస్కర్‌రావును దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్‌ చేశారు.

Published : 29 Apr 2024 03:15 IST

ఏఈఈపై చర్యలకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: అరగంట కరెంట్‌ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్‌లోని హబ్సిగూడ సర్కిల్‌ కీసర డివిజనల్‌ ఇంజినీర్‌ (డీఈ) ఎల్‌.భాస్కర్‌రావును దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్‌ చేశారు. నాగారం ఆపరేషన్‌ అడిషనల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈఈ)పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో లైన్‌ క్లియరెన్స్‌ (ఎల్‌సీ) తీసుకోవాలన్నా.. సర్కిల్‌ ఎస్‌ఈ ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. 33కేవీ అమ్ముగూడ ఫీడర్‌పై డీఈ భాస్కర్‌రావు శనివారం అనుమతి లేకుండానే ఎల్‌సీ ఇచ్చారు. దీంతో ఆ రోజు ఉదయం 10.05 నుంచి 10.35 వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో నాగారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి భారాస ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కరెంట్‌ కోతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ విషయం కార్పొరేట్‌ కార్యాలయం దృష్టికి రావడంతో నివేదిక ఇవ్వాలని ఎస్‌ఈ, సీజీఎంను సీఎండీ కోరారు. ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా అరగంట పాటు కరెంట్‌ సరఫరా నిలిపేశారని తేలింది. దీనిని తీవ్రంగా భావించిన యాజమాన్యం డీఈ, నాగారం ఏఈఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అలానే ఈ వేసవిలో వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ సరఫరాకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై కార్పొరేట్‌ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని