2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌

గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్‌ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాఠోడ్‌ అన్నారు.

Published : 29 Apr 2024 02:59 IST

రాజస్థాన్‌ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్‌ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాఠోడ్‌ అన్నారు. 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారని చెప్పారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని నారాయణగూడ కేశవ స్మారక విద్యాసంస్థల సభామందిరంలో వికసిత్‌ భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘వికసిత్‌ భారత్‌జీ 2047’ ప్రతినిధులతో సమావేశం జరిగింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. రాజ్యవర్ధన్‌సింగ్‌ రాఠోడ్‌ మాట్లాడుతూ.. తాను 27 ఏళ్లు సైన్యంలో ఉన్నానని, గతంలో సరిహద్దుల్లో ఉండే సైనికులకు మౌలిక సౌకర్యాలు, రక్షణ కవచాలు, అత్యాధునిక ఆయుధాలు ఉండేవి కాదన్నారు. మోదీ వచ్చిన తర్వాత సైనికులకు అవసరమైన ఆయుధాలు, రక్షణ కవచాలు అందించడమే కాకుండా 80 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని చెప్పారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని 2014 వరకు ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండేది కాదన్నారు. మోదీ 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా తీర్చిదిద్దడానికి పక్కా రూట్‌మ్యాప్‌ రూపొందించారని చెప్పారు. పోలింగ్‌ రోజు అంటే సెలవు రోజు కాదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో నమో యాప్‌ ప్రతినిధి శైలేష్‌ పాండే, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాఠోడ్‌, వికసిత్‌ భారత్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి అమర్‌నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని