కేయూలో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి

కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం సభ్యులపై దాడికి పాల్పడ్డ ఏబీవీపీ, బజరంగ్‌దళ్‌ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫోరం సభ్యులు డిమాండ్‌ చేశారు.

Published : 30 Apr 2024 04:06 IST

సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం

ఈనాడు, వరంగల్‌, హైదరాబాద్‌- ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం సభ్యులపై దాడికి పాల్పడ్డ ఏబీవీపీ, బజరంగ్‌దళ్‌ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫోరం సభ్యులు డిమాండ్‌ చేశారు. సోమవారం వరంగల్‌, హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లలో ఫోరం సభ్యులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారు. తమది భావ ప్రకటన స్వేచ్ఛతో కూడిన, మత ప్రసక్తి లేని రచయితల సమూహమని తెలిపారు. ఆదివారం కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘లౌకిక విలువలు సాహిత్యం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సదస్సును ఏబీవీపీ, బజరంగ్‌దళ్‌ ప్రతినిధులు అడ్డుకోవడంతో రసాభాసగా మారింది. సదస్సులో వక్తలు దేవుళ్లను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ, రామాయణంపై విమర్శనాత్మకంగా మాట్లాడడం తగదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘం నేతలు పలువురు రచయితలపై దాడికి దిగారు. విద్యార్థుల చర్యలను ఫోరం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రం నలుమూలల నుంచి 300 వరకు రచయితలు హాజరైన సదస్సుకు ఐదారుగురు విద్యార్థులు వచ్చి రాముడి గురించి మాట్లాడ్డానికి మీరెవరంటూ తోసివేయడం దారుణమని అన్నారు. సమావేశాల్లో రచయితలు కాత్యాయని విద్మహే, అనిశెట్టి రజిత, మెట్టు రవీందర్‌, వి.శ్రీనివాస్‌, అవినాశ్‌, డా.ఏకే ప్రభాకర్‌, స్కై బాబా, రవీందర్‌, భూపతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రచయితలపై దాడిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలు సంఘాలు, వేదికల ప్రతినిధులు ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని