అంకురాలకు శాపం... నిర్వహణ లోపం!

నవీకరణ, వ్యాపార, ఉద్యోగావకాశాల కల్పనలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలో అమెరికా, చైనాల తరవాత అత్యధిక అంకురాలతో భారత్‌ మూడో స్థానం ఆక్రమిస్తోంది.

Published : 19 Apr 2024 01:20 IST

నవీకరణ, వ్యాపార, ఉద్యోగావకాశాల కల్పనలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలో అమెరికా, చైనాల తరవాత అత్యధిక అంకురాలతో భారత్‌ మూడో స్థానం ఆక్రమిస్తోంది. ఈ సంస్థలు ఒడుదొడుకులను ఎదుర్కొని నిలదొక్కుకోవడానికి పటిష్ఠ నిర్వహణ ఎంతో అవసరం.

దేశంలో నిరుడు డిసెంబరు నాటికి 1,17,254 అంకుర సంస్థలు ఏర్పాటయ్యాయని, వాటిలో 12.42 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహకశాఖ (డీపీఐఐటీ) ఇటీవల వెల్లడించింది. అయితే, భారతీయ వ్యాపార, ప్రత్యామ్నాయ పెట్టుబడిదారుల సంఘం (ఐవీసీఏ), అమెరికాకు చెందిన బెయిన్‌ అండ్‌ కంపెనీల సంయుక్త నివేదిక ఓ చేదు వాస్తవాన్ని బహిర్గతం చేసింది. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో మార్పులవల్ల పెట్టుబడులు తెగ్గోసుకుపోవడంతో 2023లో భారత్‌లో 35,000 అంకురాలు మూతపడి సుమారు 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంది. ఇలాంటివారిలో చాలామంది బైజూస్‌ వంటి ఎడ్యుటెక్‌ అంకుర సంస్థల్లో ఉద్వాసనకు గురైనవారే.

నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి...

నిర్వహణపరమైన లోపాలే బైజూస్‌కు శాపాలుగా మారాయి. భారత్‌ పే, మోజోకేర్‌, గో మెకానిక్‌ వంటి అంకురాల్లోనూ కార్పొరేట్‌ నిర్వహణ ప్రమాణాల ఉల్లంఘన చోటుచేసుకుంది. దాంతో అంకుర సంస్థలు ఇతరుల నుంచి అందుకున్న పెట్టుబడులకు సంరక్షకులుగా వ్యవహరించడంతో పాటు ఆర్థికపరంగా బాధ్యతాయుతంగా మెలగాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సూచించింది. అందుకోసం ఒక నిబంధనావళిని రూపొందించింది. పెట్టుబడిదారులు, ఇతర భాగస్వాములు తమ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఈ నిబంధనావళిని పాటించాలని నిర్దేశించింది. కార్పొరేట్‌ నిర్వహణపై ఖర్చును వృథాగా పరిగణించరాదని, సరైన నిర్వహణ లేకపోతే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించింది. కార్పొరేట్‌ నిర్వహణ అంటే కంపెనీలను సమర్థంగా నడిపించడం, సంస్థలో నిర్ణయాలు తీసుకునే అధికారం, జవాబుదారీతనం ఎవరికి అప్పగించాలో నిర్ధారించడం. అంకురాలు పటిష్ఠ నిర్వహణతోనే వాటాదారులు, ఉద్యోగులు, ఖాతాదారులు, సరఫరాదారులు వంటి కీలక భాగస్వాముల ప్రయోజనాలను సంరక్షించగలవంటూ సీఐఐ మార్గనిర్దేశనం చేసింది.  సరైన కార్పొరేట్‌ నిర్వహణ నిబంధనావళిని పాటించడం ద్వారానే అంకుర సంస్థలు వ్యాపారంలో నిలదొక్కుకుని, తమ బ్రాండ్‌ విలువను పెంచుకోగలుగుతాయి. తద్వారా దీర్ఘకాల ప్రగతి సాధించగలుగుతాయి.

కానీ, కొత్తగా అంకురాలను స్థాపించిన ఔత్సాహికులు ఈ అంశాలను విస్మరిస్తుంటారు. విపరీతమైన పోటీ వాతావరణంలో నెగ్గుకురావాలి కాబట్టి కార్పొరేట్‌ నిర్వహణ నియమాలను పట్టించుకునే ఓపిక, తీరిక చాలామందికి ఉండటంలేదు. పైగా తొలిసారి అంకురాలను ప్రారంభించినవారికి నిర్వహణానుభవమూ ఉండదు. శీఘ్ర లాభాలు, వ్యాపార పురోగతి కోసం పెట్టుబడిదారుల నుంచి నిరంతరం వచ్చే ఒత్తిడి కార్పొరేట్‌ నిర్వహణను అలక్ష్యం చేసేలా పురిగొల్పుతాయి. అంతర్జాతీయ వెంచర్‌ పెట్టుబడిదారులు మొదట్లో భారత్‌లో అవకాశాలు కోల్పోతామనే భయంతో ఆదరాబాదరా ఒప్పందాలు కుదుర్చుకుని, కార్పొరేట్‌ నిర్వహణ ప్రమాణాలకు తిలోదకాలిచ్చారు. మరిన్ని పెట్టుబడులు రాబట్టాలనే ఉద్దేశంతో అంకురాలు వ్యాపారాభివృద్ధికన్నా తమ కంపెనీ మార్కెట్‌ వాల్యుయేషన్‌ను పెంచుకోవడానికే ప్రాధాన్యమిచ్చాయి. మరోవైపు ప్రభుత్వం- అంకురాలు జీడీపీ వృద్ధికి తోడ్పడతాయనే భావనతో ఎన్నో మినహాయింపులు, రాయితీలు ఇచ్చింది. అంకురాలను మితిమీరి నియంత్రిస్తే నవీకరణ దెబ్బతింటుందనే భావనతో కార్పొరేట్‌ నిర్వహణ ప్రమాణాల గురించి పెద్దగా పట్టుపట్టలేదు. ఏతావతా అంకురాలు తమకు తాముగా కార్పొరేట్‌ నిర్వహణను అలవరచుకోవడం ద్వారా మాత్రమే నవీకరణకు భంగం కలగకుండా ఆర్థిక క్రమశిక్షణతో మెలగుతాయని సీఐఐ గుర్తించింది. అందుకే తాజా నిబంధనావళిని ప్రతిపాదించింది. ఇప్పటికే పలు భారతీయ అంకురాలు మూతపడటంతో వెంచర్‌ పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సరైన కార్పొరేట్‌ నిర్వహణ ఉన్న అంకురాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఒక ఔత్సాహికుడు నవ కల్పనతో అంకురాన్ని విజయ శిఖరాలకు పరుగులు పెట్టించవచ్చు. కానీ, వ్యాపారం విస్తరిస్తున్నకొద్దీ దాన్ని పకడ్బందీగా నిర్వహించే అనుభవం అతడికి ఉండకపోవచ్చు. వ్యవస్థాపకుడికి అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉంటుందని భావించలేం. కాబట్టి నిపుణుల సేవలను తీసుకోవడానికి వెనకాడకూడదు. వెంచర్‌ పెట్టుబడిదారులు ఈ విషయంలో చేయూతనివ్వాలి.

కృత్రిమ మేధతో లాభాల పంట

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అత్యధికంగా వెంచర్‌ పెట్టుబడులను ఆకర్షించిన దేశాల్లో ఇండియాది ఇప్పటికీ రెండో స్థానమే. 2014-22 మధ్య భారతీయ అంకురాలకు 13,100కోట్ల డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. 2023లో టెక్‌ అంకురాలకు వెంచర్‌ పెట్టుబడులు తగ్గాయి. ఇప్పుడు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా రంగం (బీఎఫ్‌ఎస్‌ఐ), ఆరోగ్య సంరక్షణ, చిల్లర వర్తకానికి వెంచర్‌ పెట్టుబడిదారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పోనుపోను కృత్రిమ మేధ (ఏఐ)ను చేపట్టే అంకురాలకు పెద్దమొత్తంలో పెట్టుబడులు ప్రవహించనున్నాయి.

వరప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.