జలయజ్ఞ విధ్వంసకుడు జగన్‌

చీమకు కూడా అపకారం చేయని పరమ సాధుజీవి తానేనంటూ తోడేలు ఒకటి అమాయకపు ముఖం పెట్టిందట! చావు తెలివితేటల్లో దాన్ని మించిపోయిన వైకాపా అధినేత- ‘విశ్వసనీయత అన్న పదానికి అర్థం జగనే’ అంటూ సిగ్గుమాలిన సొంతడబ్బా కొట్టుకుంటున్నారు. ‘పోలవరం, పూల సుబ్బయ్య వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం’ అని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో...

Updated : 24 Apr 2024 01:24 IST

చీమకు కూడా అపకారం చేయని పరమ సాధుజీవి తానేనంటూ తోడేలు ఒకటి అమాయకపు ముఖం పెట్టిందట! చావు తెలివితేటల్లో దాన్ని మించిపోయిన వైకాపా అధినేత- ‘విశ్వసనీయత అన్న పదానికి అర్థం జగనే’ అంటూ సిగ్గుమాలిన సొంతడబ్బా కొట్టుకుంటున్నారు. ‘పోలవరం, పూల సుబ్బయ్య వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం’ అని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్‌ నమ్మబలికారు. ‘మన ప్రభుత్వం రాగానే పెండింగ్‌లో ఉన్న ప్రతి సాగునీటి ప్రాజెక్టునూ పూర్తిచేస్తాం’ అంటూ ప్రజా సంకల్పయాత్రలోనూ పిట్టలదొర కబుర్లెన్నో చెప్పారు. వాగ్దానాలతో జనాన్ని బులిపించి ఓట్లు గుద్దించుకున్న జగన్‌- సీఎంగా జలయజ్ఞాన్ని భగ్నంచేసి రైతులోకానికి రాక్షసుడయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి పదవిలోకి రాగానే- అప్పటికి 20శాతానికి లోపు పనులు జరిగిన ప్రాజెక్టుల్లో తనకు కావాల్సినవారి చేతుల్లో ఉన్నవి తప్ప మిగిలిన వాటిని నిలిపివేయించారు. రూ.90,632 కోట్ల విలువైన నూతన ప్రాజెక్టులను తెరపైకి తీసుకొచ్చారు. పోలవరం కాకుండా పాతవి, కొత్తవి కలిపి మొత్తం 54 ప్రాజెక్టులతో ఒక జాబితాను తయారుచేయించారు. వాటిలో పూర్తయినవి... నెల్లూరు, సంగం బ్యారేజీలు, అవుకు టన్నెల్‌ మాత్రమే! ఆ మూడింట్లోనూ దాదాపు 70శాతం పనులు జగన్‌ సీఏం కాకమునుపే ఒక కొలిక్కి వచ్చాయి. ఏతావతా నెర్రెలిచ్చిన చేలకు నీళ్లు పారించడానికి జగన్‌ చేసిందేమీ లేదు. పోలవరంతో పాటు అన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1.31 లక్షల కోట్లు అవసరమైతే- నిరుడు అక్టోబర్‌ నాటికి వైకాపా సర్కారు విదిల్చింది రూ.32వేల కోట్లే. అందులోనూ అధిక భాగం సిబ్బంది జీతభత్యాలు, పాలన ఖర్చులకే చెల్లిపోయింది. నిధులు బిగపట్టి సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టిన జగన్‌- రైతన్నలను కరువు రక్కసికి బలిచ్చారు!

అరాచక జలనిర్వహణ విధానాలతో ముక్కారు పంటలు పండే కృష్ణా డెల్టాను ఎండగట్టిన సర్వభ్రష్ట పాలకుడు జగన్‌. ఇటీవల తూర్పు డెల్టాలో సాగునీరు పారక దాదాపు లక్ష ఎకరాల్లో పంట చేతికందని దయనీయ దురవస్థ నెలకొంది. పశ్చిమ డెల్టాలోనూ ఆయకట్టు చివరి భూములకు నీరందక వరి పైర్లు ఎండిపోయి అన్నదాతలను దుర్భర గర్భశోకంలో ముంచేశాయి. 2022 నుంచి మొన్న జనవరి వరకు 1395 టీఎంసీల కృష్ణా జలాలు వట్టిగా బంగాళాఖాతం పాలయ్యాయి. అదే సమయంలో అటు గోదావరి నుంచి తొమ్మిది వేల టీఎంసీలకు పైగా నీళ్లు వృథాగా కడలిలో కలిశాయి. చింతలపూడి, పురుషోత్తపట్నం, తాడిపూడి ఎత్తిపోతల పథకాలతో పాటు మరెన్నో ప్రాజెక్టులను గాలికొదిలేసిన జగన్‌ పాతకమే కర్షకులను కన్నీటి సంద్రంలో ముంచేసింది. తెలుగుదేశం ప్రభుత్వం పట్టుపట్టి నిర్మించిన పట్టిసీమే ఆపత్కాలంలో కృష్ణా ఆయకట్టును కొంతవరకు ఆదుకొంది. అటువంటి ప్రాజెక్టుపైనా విషంకక్కిన పాపిష్టి చరిత్ర జగన్‌ది.   మరోవైపు, నీటిచెమ్మకోసం అంగలార్చే అనంతపురం అన్నదాతలకు అండగా ఉంటానని... తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్‌ఎల్‌సీ)ను పటిష్ఠపరచి, దాని సామర్థ్యం పెంచుతానని జగన్‌ హామీల వరద పారించారు. ఆయన సర్కారు కొలువుతీరేనాటికే హెచ్‌ఎల్‌సీ ఆధునికీకరణ 67శాతం పూర్తయ్యింది. మిగిలిన పనులకు పైసలివ్వని జగన్‌- కాలువ తాత్కాలిక మరమ్మతులకు రూ.36 కోట్లు కూడా రాల్చకుండా రాయలసీమ రైతులను దారుణంగా దగా చేశారు. తారకరామతీర్థ సాగర్‌ను రెండేళ్లలో జాతికి అంకితం చేస్తానన్న వైకాపా అధినేత- ఆ మాటను గంగలో కలిపేసి ఉత్తరాంధ్ర సాగుదారులను నిలువునా వంచించారు. పంటకాల్వల బాగుసేతకు, ప్రాజెక్టుల నిర్వహణకు జగన్‌ నిధులివ్వలేదు. గేట్లు కొట్టుకుపోయినా, గండ్లు పడినా ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. అటువంటి జగన్మోసకారి రాజ్యాన్ని వదిలించుకునేందుకు రాష్ట్ర రైతాంగం ఇప్పటికే సిద్ధమైంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.