Published : 19/12/2022 20:48 IST

కలబందతో కాంతివంతం!

సౌందర్య సంరక్షణకు ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ క్రమంలో మార్కెట్లో దొరికే వాటి కన్నా ఇంట్లో సహజసిద్ధంగా లభించే ఉత్పత్తులే మంచివి. అలా సహజసిద్ధంగా లభించే మొక్కే కలబంద. రసాయనాలతో తయారు చేసిన సౌందర్య ఉత్పత్తులు వాడి, లేనిపోని చర్మ సమస్యలు కొని తెచ్చుకునే కంటే.. ఎలాంటి దుష్ప్రభావాలు లేని కలబందను వాడడం ఎంతో ఉత్తమం. జిడ్డుగా, పొడిగా, సున్నితంగా.. ఇలా అన్ని రకాల చర్మతత్వాల వారికీ బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో కలబంద చర్మానికి చేకూర్చే ప్రయోజనాలేంటో ఓ లుక్కేద్దాం రండి..

ముఖం కాంతివంతంగా ఉండాలంటే..

ముఖం మరింత కాంతివంతంగా ఉండాలంటే ఇలా ప్రయత్నించండి.. చిటికెడు పసుపు, ఒక చెంచా పాలు, కొంచెం రోజ్‌వాటర్, చెంచా తేనె.. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి కలబంద గుజ్జును జోడించి బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే ముఖం కాంతివంతమవుతుంది.

జిడ్డుగా ఉందా?

చర్మతత్వం జిడ్డుగా ఉండే వారిని మొటిమల సమస్య ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు కలబంద ఆకుని నీళ్లలో కాసేపు మరిగించి దాన్ని పేస్ట్‌లాగా మిక్సీ పట్టుకోవాలి. దానికి కొన్ని చుక్కల తేనె కలుపుకొని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

మరింత నాజూగ్గా..

చర్మ సౌందర్యానికే కాదు.. గాయాల వల్ల చర్మంపై ఏర్పడిన మచ్చలను పోగొట్టడంలోనూ కలబంద గుజ్జు ఉపయోగపడుతుంది. చర్మం మరింత నాజూగ్గా తయారు కావాలంటే.. కలబంద గుజ్జులో కాస్త రోజ్‌వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇరవై నిమిషాల పాటు ముఖానికి నెమ్మదిగా రుద్దుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పొడి చర్మం గలవారు..

చర్మతత్వం పొడిగా ఉండే వారికి ఎప్పుడు చూసినా ముఖం డల్‌గా కనిపిస్తుంది. కారణం చర్మంలో ఉండే తేమశాతం తగ్గిపోవడం. మరి తేమ శాతాన్ని పెంచుకోవాలంటే కొద్దిగా కలబంద గుజ్జులో కాస్త ఆలివ్ ఆయిల్‌ని వేసి మెత్తటి పేస్ట్‌లాగా కలుపుకోవాలి. తర్వాత ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే ఫలితం మీకే తెలుస్తుంది.

ట్యాన్‌ను తొలగించుకోవాలంటే..

చర్మంపై ఎండ పడి ట్యాన్ సమస్య రావడం సర్వసాధారణం. ఈ క్రమంలో కాస్త కలబంద గుజ్జు తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉండే ప్రదేశంలో రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల కేవలం ట్యాన్ మాత్రమే కాదు.. మొటిమలు కూడా తగ్గిపోతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని