Ukraine crisis: రష్యా వైపు భారీ నష్టం.. కీవ్‌లో భయం భయం!

రష్యా సేనలు ముందుకు దూసుకొస్తుండటంతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో భయందోళనలు వ్యక్తమవుతున్నాయి. శత్రుసేనల్ని ఉక్రెయిన్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది......

Updated : 01 Mar 2022 17:10 IST

కీవ్‌: రష్యా సేనలు ముందుకు దూసుకొస్తుండటంతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో భయందోళనలు వ్యక్తమవుతున్నాయి. శత్రుసేనల్ని ఉక్రెయిన్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. దీంతో ఇరు సైన్యాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రష్యాను తీవ్రంగా నష్టపరిచినట్టు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా దాదాపు 5710 మంది సైనికుల్ని (మృతిచెందినవారు, గాయాలైనవారు కలిపి) నష్టపోవడంతో పాటు 29 విమానాలు కూల్చినట్టు ప్రకటించింది. అలాగే, 29 హెలికాప్టర్లు, 198 ట్యాంకులు, 846 సాయుధ శకటాలు, 305 వాహనాలు, 60 ఇంధన ట్యాంకులు, రెండు పడవలు, ఏడు డ్రోన్‌లను ధ్వంసం చేసి రష్యాను దెబ్బతీసినట్టు వివరించింది. అలాగే, 200 మంది సైనికుల్ని పట్టుకున్నట్టు తెలిపింది.

భారీ కాన్వాయ్‌తో కీవ్‌ వైపు దూసుకొస్తున్న పుతిన్‌ సేనలు..

మరోవైపు, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల 24 నుంచి రష్యా ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నప్పటికీ జెలెన్‌స్కీ ప్రభుత్వం తగ్గేదే లే అంటోంది. దీంతో రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా పుతిన్‌ సర్కార్‌ పావులు కదుపుతోంది. కీవ్‌ వైపు వెళ్లే రోడ్ల వెంట దాదాపు 65 కి.మీల మేర మాస్కో సేనల వాహనాలు బారులు తీరడంతో.. రాజధాని నగరాన్ని ఆక్రమించుకొనే లక్ష్యంతో రష్యా పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తున్నట్టు పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి. నిన్న తొలి దఫా చర్చలతో దాడుల తీవ్రతను కాస్త తగ్గించినప్పటికీ రష్యా భారీగానే తమ సేనల్ని మోహరించింది. ఉక్రెయిన్‌కు తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల శివార్లలో పుతిన్‌ సేనలు బారులు తీరినట్టు అమెరికాకు చెందిన మాక్సర్‌ సంస్థ తీసిన ఉపగ్రహ చిత్రాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ ఉపగ్రహ చిత్రాలను సోమవారం తీసినట్టు మాక్సర్‌ సంస్థ వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని