Ukraine Crisis: రష్యా దాడుల వేళ.. ఉక్రెయిన్‌ ముంగిట మరో శీతాకాలం..!

గత శీతాకాలంలో ఇంధన వసతులే లక్ష్యంగా రష్యా జరిపిన దాడులతో ఉక్రెయిన్‌ గజగజలాడింది. ఈ క్రమంలోనే మరోసారి చలికాలం సమీపిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

Published : 13 Nov 2023 02:08 IST

కీవ్‌: గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) మొదలుపెట్టిన దాడులు నేటికీ కొనసాగుతున్నాయి. తాజాగా 52 రోజుల విరామం తర్వాత కీవ్‌ (Kyiv) నగరంపై మాస్కో సేనలు మరోసారి క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తమ ఇంధన వనరులే లక్ష్యంగా దాడులు చేపట్టేందుకు రష్యా సిద్ధంగా ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) ఆరోపించిన రోజుల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. గత శీతాకాలంలో ఇంధన వసతులే లక్ష్యంగా మాస్కో జరిపిన ప్రణాళికాబద్ధ దాడులతో.. ఉక్రెయిన్‌ గజగజలాడింది. ఈ క్రమంలోనే మరోసారి చలికాలం సమీపిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

కీవ్‌పై విరుచుకుపడ్డ పుతిన్‌ సేనలు.. గూడ్సు రైలుపై క్షిపణి దాడి

గత శీతాకాలంలో (డిసెంబరు నుంచి మార్చి) విద్యుత్‌ గ్రిడ్‌లు, నీటి సరఫరా వ్యవస్థల వంటి మౌలిక సదుపాయాలపై రష్యా భారీఎత్తున వైమానిక, శతఘ్ని దాడులు జరిపింది. ఫలితంగా ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు అంధకారంలో మిగిలిపోయాయి. ఎముకలు కొరికే చలిలో అటు హీటర్లు పనిచేయక, ఇటు నీటి కటకటతో ప్రజలు నరకయాతన పడ్డారు. ప్రభుత్వానికి భారీ ఆస్తినష్టం వాటిల్లింది. అయితే, ఈసారి రష్యా దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించినట్లు జెలెన్‌స్కీ ఇటీవల ప్రకటించారు. పవర్‌ గ్రిడ్‌ను దెబ్బతీసేందుకు యత్నిస్తే.. రష్యా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసేందుకూ వెనకాడబోమని ఉక్రెయిన్‌ ఇప్పటికే హెచ్చరించింది.

ఖేర్సన్‌ విముక్తికి ఏడాది..

ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, దాని పరిసర ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలు వైదొలిగి ఏడాది పూర్తయిన సందర్భంగా జెలెన్‌స్కీ మాట్లాడారు. ఖేర్సన్‌ను ‘ఆశల నగరం’గా అభివర్ణించారు. రష్యన్‌ ఆక్రమణదారులను ఎదిరించి.. ఖేర్సన్‌ను విముక్తి చేయడంతోపాటు వారి అకృత్యాల నుంచి ప్రజలను రక్షించిన బలగాలను ప్రశంసించారు. నల్ల సముద్రంలో, క్రిమియా భూభాగంలో.. ఇలా రష్యాకు సంబంధించిన ఏ ప్రదేశానికైనా చేరుకోగలమని ఇటీవలి తమ దాడులు నిరూపించాయని చెప్పారు. ఇదిలా ఉండగా.. యుద్ధం మొదలైన ఎనిమిది నెలల తర్వాత నవంబరులో ఖేర్సన్‌ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయి. ఈ ప్రాంతానికి సరఫరాలు చేరవేయడం అసాధ్యమని తేలిన నేపథ్యంలో వైదొలిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని