Alexei Navalny: ‘కేజీబీ వన్‌-పంచ్‌’ టెక్నిక్‌తో నావల్నీని చంపేశారా?

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని ‘కేజీబీ వన్‌-పంచ్‌’ టెక్నిక్‌తో చంపేసుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 23 Feb 2024 02:19 IST

మాస్కో: రష్యా (Russia) ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) మృతిని రాజకీయ హత్యగా పలువురు వ్యాఖ్యానించారు. ఆయనది సహజ మరణమని రష్యా ప్రభుత్వం చెబుతుండగా.. జైల్లో హింసించి చంపేశారని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అయితే, నావల్నీని ‘కేజీబీ వన్‌-పంచ్‌’(KGB One-Punch) టెక్నిక్‌తో చంపేసుంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రష్యా గూఢచార సంస్థ ‘కేజీబీ’.. ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు దీన్ని ఉపయోగిస్తుంది. నావల్నీని కూడా ఇదే టెక్నిక్‌తో హత్య చేసుంటారని మానవ హక్కుల కార్యకర్త వ్లాదిమిర్‌ ఒసెచ్కిన్‌ అనుమానం వ్యక్తంచేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అవతలి వ్యక్తి ఛాతీపై గట్టిగా కొట్టడంతో ఒక్కసారిగా గుండెపోటుకు  గురై చనిపోయేలా చేయడమే దీని ప్రత్యేకతని ఒసెచ్కిన్‌ చెప్పినట్లు పేర్కొన్నాయి. దీన్ని కేజీబీ పాత టెక్నిక్‌గా చెబుతున్నారు. 

పుతిన్‌ లాంటి అధ్యక్షులతో అణుయుద్ధం ముప్పు: బైడెన్‌

‘‘నాకున్న సమాచారం మేరకు.. కొద్ది రోజులు ముందుగానే ఇందుకు పథక రచన చేశారు. మాస్కో నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. క్రెమ్లిన్‌ మద్దతు లేకుండా కెమెరాలు తొలగించి ఈ పని చేయడం అసాధ్యం’’ అని ఒసెచ్కిన్‌ వ్యాఖ్యానించినట్లు కథనంలో పేర్కొన్నాయి. నావల్నీ మృతదేహాన్ని మార్చురీకి తరలించినప్పుడు ఆయన ఛాతీ, తలపై కమిలిన గాయాలు కనిపించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈక్రమంలో ఒసెచ్కిన్‌ వ్యాఖ్యలు వాటిని బలపరిచేలా ఉన్నాయని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

మరోవైపు నావల్నీ మృతదేహం ఎక్కడ ఉందనేది ఇప్పటికీ తెలియరాలేదు. తన కుమారుడిని కడసారి చూసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన తల్లి లియుడ్మిలా అధ్యక్షుడు పుతిన్‌ను వేడుకున్నారు. గౌరవప్రదంగా ఖననం చేసేందుకు భౌతికకాయాన్ని అప్పగించాలని కోరారు. మరణానికి కారణం ఇంకా తెలియరాలేదని, ప్రాథమిక విచారణ కొనసాగుతోన్న నేపథ్యంలో మరో రెండు వారాల పాటు వేచి చూడాలని అధికారులు చెప్పినట్లు నావల్నీ బృంద సభ్యులు తెలిపారు. సాక్ష్యాలను దాచిపెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని వారు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని