Joe Biden: పుతిన్‌ లాంటి అధ్యక్షులతో అణుయుద్ధం ముప్పు: బైడెన్‌

పుతిన్‌ లాంటి వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నంత కాలం అణుయుద్ధం రూపంలో ముప్పు పొంచి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వ్యాఖ్యానించారు.

Updated : 22 Feb 2024 18:19 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మరోసారి నోరు జారారు. రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin)ను అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన వల్ల అణు యుద్ధం రూపంలో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందన్నారు. బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పుతిన్‌ లాంటి వెర్రి వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నంతకాలం అణు యుద్ధం గురించి ఆందోళన చెందాల్సిందే. అలాంటి వ్యక్తులతో మానవాళి మనుగడకు ప్రమాదం. శుక్రవారం నుంచి రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తాం’’ అని బైడెన్‌ తెలిపారు. ఈ సమావేశంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)పైనా విమర్శలు చేశారు. రష్యా ప్రతిపక్ష నాయకుడు నావల్నీ మృతికి, తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు ముడిపెడుతూ ట్రంప్‌ మాట్లాడటాన్ని బైడెన్‌ తప్పుబట్టారు. 

అంతరిక్షంలో మా అణ్వస్త్రాలు లేవు: పుతిన్‌

పుతిన్‌పై బైడెన్‌ విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన నాటినుంచి పుతిన్‌ విధానాలపై బైడెన్‌ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయనను కసాయి, యుద్ధ నేరస్థుడిగా పేర్కొన్నారు. ఇటీవల అనుమానాస్పద రీతిలో జైల్లో మృతి చెందిన రష్యా ప్రతిపక్ష నాయకుడు నావల్నీ మృతికి పుతినే కారణమని ఆరోపించారు. మరోవైపు ట్రంప్‌ కంటే బైడెన్‌ ఎంతో మేలని రష్యా అధ్యక్షుడు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ గెలవాలని మాస్కో కోరుకుంటున్నట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని