Russia: ఉక్రెయిన్‌ స్ట్రామ్‌ షాడో దాడిలో రష్యా లెఫ్టినెంట్‌ జనరల్‌ మృతి..!

రష్యాకు చెందిన ఓ లెఫ్టినెంట్‌ జనరల్‌ను ఉక్రెయిన్‌ మట్టుబెట్టింది. ఇందుకోసం యూకే అందించిన శక్తిమంతమైన క్షిపణిని వాడింది.  

Published : 12 Jul 2023 15:40 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్‌ (Ukraine) దళాలు రష్యా(Russia)ను గట్టిదెబ్బ కొట్టాయి. ఆ దేశ లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారిని మట్టుబెట్టాయి. ఇందుకోసం యూకే సరఫరా చేసిన ‘స్ట్రామ్‌ షాడో’ క్షిపణిని ఉపయోగించాయి. బెర్డియాన్స్క్‌ నగరంలో రాత్రివేళ జరిగిన దాడిలో లెఫ్టినెంట్‌ జనరల్‌ ఒలేగ్‌ యూరివిచ్‌ త్సొకోవ్‌ మరణించారు. ఈ విషయాన్ని మేరియుపొల్‌ మేయర్‌ టెలిగ్రామ్‌ చానెల్‌ కూడా ధ్రువీకరించింది. రష్యా ఆక్రమిత ప్రాంతంలోని దున హోటల్‌లో రష్యా సైనిక నాయకత్వంలోని కీలక కమాండర్లు ఉంటున్నారు. ఈ దాడిలో హోటల్‌ మొత్తం పూర్తిగా నేలమట్టమైంది. ఈ భవనానికి అత్యంత సమీపంలోనే యాంటీ మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ఉన్నా.. ఈ దాడి జరగడం విశేషం. 

ఈ దాడికి యూకే అందించిన స్ట్రామ్‌ షాడో క్షిపణిని వాడినట్లు సమాచారం. కుప్పకూలిన హోటల్‌ వద్ద పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు, భారీ పరికరాలతో కూడిన వాహనాలు వచ్చి శకలాలను తొలగిస్తున్నట్లు కీవ్‌ పత్రికలు పేర్కొన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో రష్యాకు చెందిన 20వ కంబైన్డ్‌ ఆర్మీ  సర్వీసులోని 144 మోటరైజ్డ్‌ రైఫిల్‌ డివిజన్‌కు కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో లుహాన్స్క్‌పై ఉక్రెయిన్‌ శతఘ్ని దాడిలో ఆయన గాయపడ్డారు. ఆ తర్వాత ఆయన్ను లెఫ్టినెంట్‌ జనరల్‌గా ప్రమోట్‌ చేశారు. రష్యా అధికారికంగా ఆయన మృతిని ధ్రువీకరించలేదు. రష్యా సైన్యంలో యూరివిచ్‌ త్సొకోవ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. రెండు చెచెన్య పోరాటాల నుంచి రష్యా చేసిన ప్రతి యుద్ధంలోనూ అతడు పాల్గొన్నాడు. రష్యా దళాలు క్రిమియా ఆక్రమణ సమయంలో  అతడు కూడా ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని