Afghan Earthquake: అఫ్గాన్‌లో పెను విధ్వంసం... వెయ్యికి చేరువగా మృతులు!

అఫ్గానిస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించినట్లు కనిపిస్తోంది.

Published : 22 Jun 2022 16:12 IST

600 మందికి గాయాలు

కాబుల్: అఫ్గానిస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించినట్లు కనిపిస్తోంది. గంటల వ్యవధిలోనే మృతుల సంఖ్య వందల్లో పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకూ సుమారు 920 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారి సంఖ్య 600కిపైగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రదేశం మారుమూల పర్వత ప్రాంతం కావడంతో సమాచార లోపం నెలకొంది. సహాయ కార్యక్రమాలకూ ఆటంకం కలుగుతోంది. దాంతో మరణాలపై పూర్తి స్పష్టత రావడం లేదని అధికారులు చెబుతున్నారు.  

పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖోస్ట్, పక్టికా ప్రావిన్స్‌లో ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించిందని యూఎస్‌ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. అక్కడి మీడియాలో వస్తున్న దృశ్యాలు భూకంప తీవ్రతను కళ్లకుగడుతున్నాయి. ఇళ్లు ధ్వంసమై శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సహాయం కోసం అర్థించే పరిస్థితి నెలకొంది. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని, తమకు అంతర్జాతీయ సమాజం సహకారం కావాలని అఫ్గాన్‌ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రపంచ దేశాలను అభ్యర్థించింది. తాలిబన్ల ఆక్రమణతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్ ప్రజలను ఈ భూకంపం మరింత దారుణ స్థితిలోకి నెట్టేసింది.

పాక్‌లోనూ ప్రకంపనలు: భూకంపం కారణంగా పాకిస్థాన్‌లోనూ కొన్ని చోట్ల ప్రకంపనలు సంభవించాయి. పెషావర్‌, ఇస్లామాబాద్‌, లాహోర్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని పాక్‌ అధికారులు తెలిపారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని