Baltimore bridge collapse: అమెరికా వంతెన ప్రమాదంలో నిలిచిపోయిన గాలింపు చర్యలు.. ఆరుగురి మృతి!

Baltimore bridge collapse: బాల్టిమోర్‌లో కుప్పకూలిన వంతెన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

Updated : 27 Mar 2024 11:13 IST

బాల్టిమోర్‌: అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన వంతెన ప్రమాదంలో (Baltimore bridge collapse) గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపును బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఉదయం వరకు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వీరంతా వంతెనపై గుంతలు పూడుస్తున్నారని మేరీలాండ్‌ రవాణాశాఖ కార్యదర్శి పాల్‌ వైడెఫెల్డ్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది లోతు, కనిపించకుండా పోయిన తర్వాత గడిచిన సమయాన్ని బట్టి చూస్తే మరణించి ఉంటారని వారిని నియమించుకున్న కంపెనీ బ్రానర్‌ బిల్డర్స్‌ పేర్కొంది.

పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెనను నౌక ఢీకొనడంతో (Baltimore bridge collapse) వంతెన మొత్తం కుప్పకూలిన విషయం తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. నౌక ఢీకొనగానే వంతెన పిల్లర్‌ బొమ్మలా విరిగిపోయింది. ఆ వెంటనే సెకన్లలోనే వంతెన కూలింది. దీంతో ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న వాహనాలన్నీ నదిలో పడిపోయాయి. పలువురు గల్లంతయ్యారు.

అసాంజేకు ఊరట

పడిపోయిన వారిలో ఇద్దరిని సహాయక సిబ్బంది కాపాడారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఢీకొన్న నౌకలోనూ మంటలు చెలరేగాయి. అందులోని సిబ్బంది అంతా భారతీయులే. వారంతా క్షేమంగానే ఉన్నారు. తొలుత నౌకలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వెంటనే ప్రమాద సంబంధ సమాచారాన్ని నౌకా సిబ్బంది అధికారులకు అందించారు. మరుక్షణం వంతెనపై వాహనాలను ఆపేయడంతో భారీ ముప్పు తప్పింది. రాత్రి కావడం.. వాహన సంచారం తక్కువగా ఉండడంతో ప్రాణనష్టం తీవ్రత తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని