Nijjar killing: నిజ్జర్‌ హత్య కేసులో ఇద్దరు అనుమానితులు.. అరెస్టుకు సిద్ధమవుతున్న కెనడా..!

Nijjar killing: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో ఇద్దరు అనుమానితులను కెనడా పోలీసులు త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. వారింకా కెనడాలోనే ఉన్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Updated : 28 Dec 2023 13:30 IST

ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య విషయంలో భారత్‌-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నిజ్జర్‌ హత్య కేసులో ఇద్దరు అనుమానితులను కెనడా పోలీసులు (Canada Police) అతి త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వారింకా కెనడాలోనే ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

నిజ్జర్ హత్యతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితులపై గత కొన్ని నెలలుగా కెనడా పోలీసులు నిఘా పెట్టినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఘటన తర్వాత నుంచి వారు కెనడా విడిచి వెళ్లలేదని సమాచారం. రాబోయే కొన్ని వారాల్లోనే వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో వారి ప్రమేయంతో పాటు భారత ప్రభుత్వంతో వారికి ఎలాంటి సంబంధం ఉందన్న వివరాలనూ అధికారిక అభియోగాల్లో పేర్కొననున్నట్లు ఆ కథనాలు వెల్లడించాయి. ఈ వార్తలపై కెనడా దర్యాప్తు బృందం స్పందించింది. అయితే, ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున దీనిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోమని పేర్కొంది.

16ఏళ్లయినా.. మిస్టరీగానే ‘భుట్టో’ మరణం!

ఈ ఏడాది జూన్‌లో కెనడాలోని సర్రే ప్రాంతంలో నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం రాజుకుంది. ట్రూడో వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలను సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. వాటిని పరిశీలించిన తర్వాతే ఈ కేసుపై తదుపరి చర్యలు తీసుకుంటామని భారత్‌ ఇప్పటికే పలుమార్లు కెనడాకు స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల మరో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో ఓ భారతీయుడిపై అమెరికా అభియోగాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు చెక్‌ రిపబ్లిక్‌ జైల్లో ఉండగా.. అతడిని తమకు అప్పగించాలని అగ్రరాజ్యం ఒత్తిడి చేస్తోంది. ఈ పరిణామాల వేళ.. నిజ్జర్‌ హత్య కేసులో అనుమానితులను అరెస్టు చేసేందుకు కెనడా పోలీసులు సిద్ధమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని