Maldives: చైనా.. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదట!

చైనాతో (China) వ్యూహాత్మక సంబంధాలు గొప్పగా ఉన్నాయని.. తమ దేశ సార్వభౌమత్వానికి జిన్‌పింగ్‌ ప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తుందని మాల్దీవులు పేర్కొంది.

Published : 16 Jan 2024 02:49 IST

బీజింగ్‌: భారత్‌తో వివాదం కొనసాగుతున్న వేళ మాల్దీవుల తీరులో మార్పు కనిపించడం (India Maldives conflict) లేదని తెలుస్తోంది. భారత్‌తో సంబంధాలు ఎలా ఉన్నా.. చైనాతో (China) మాత్రం వ్యూహాత్మక సంబంధాలు గొప్పగా ఉన్నాయంటూ పొగడ్తలు కురిపించింది. ఇరు దేశాలు గౌరవించుకుంటాయని, తమ దేశ సార్వభౌమత్వానికి చైనా పూర్తిగా మద్దతిస్తుందని పేర్కొంది. భారత్‌ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని డెడ్‌లైన్‌ విధించిన సమయంలోనే మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed muizzu) చైనాపై ప్రశంసలు గుప్పించడం గమనార్హం.

ముయిజ్జుకు రాజధాని మాలెలో షాక్‌

మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ఇటీవలే చైనా పర్యటన ముగించుకొని వచ్చారు. 1972లో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలైనప్పటి నుంచి చైనా తమ అభివృద్ధిలో సహకారం అందించిందన్నారు. డ్రాగన్‌ చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్డు కార్యక్రమం ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇవి మరింత బలపడతాయని అన్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో జిన్‌పింగ్‌ (Xi Jinping) ప్రభుత్వం జోక్యం చేసుకోదంటూ చైనా అధికారిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను వ్యక్తిగతంగా పొగడ్తలతో ముంచెత్తిన ముయిజ్జు.. ఆయన సారథ్యంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సరికొత్త శిఖరాలకు చేరుకుందన్నారు. మాల్దీవులు తన లక్ష్యాలను సాధించేందుకు బీజింగ్‌ సహకరిస్తుందని జిన్‌పింగ్‌ హామీ ఇచ్చినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని