Zelensky: జెలెన్‌స్కీ, గ్రీక్‌ ప్రధాని కాన్వాయ్‌ లక్ష్యంగా క్షిపణి దాడి.. ?

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, గ్రీకు ప్రధాని కిరియాకోస్‌ రష్యా క్షిపణి దాడి నుంచి కొద్దిలో తప్పించుకొన్నారు.        

Updated : 07 Mar 2024 14:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky), గ్రీక్‌ ప్రధాని కిరియాకోస్‌ మిత్సటాకోస్‌ ప్రాణాంతక దాడి నుంచి తప్పించుకొన్నట్లు తెలుస్తోంది. రష్యా ప్రయోగించిన ఓ క్షిపణి వారి కాన్వాయ్‌కు కేవలం 500 మీటర్ల దూరంలో పడింది. ఈ ఘటన నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో చోటు చేసుకొంది. ఉక్రెయిన్‌ పర్యటనకు వచ్చిన కిరియాకోస్‌తో కలిసి జెలెన్‌స్కీ నగర సందర్శనకు బయల్దేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి పుట్టగొడుగు ఆకారంలో భారీగా పొగ పైకి ఎగసిపడటాన్ని ప్రత్యక్ష సాక్షులు వీక్షించారు. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్‌ నౌకాదళ ప్రతినిధి వెల్లడించారు. 

గత రెండేళ్లుగా జెలెన్‌స్కీ యుద్ధ క్షేత్రాల్లోని సైనికులను ఉత్సాహపర్చేందుకు పర్యటనలు చేస్తున్నారు. ఆయనతోపాటు పలువురు ప్రపంచ నాయకులను కూడా తీసుకెళుతున్నారు. కానీ, బుధవారం నాటో సభ్యదేశమైన గ్రీక్‌ ప్రధాని ఉండగానే ఈ దాడి జరగడం గమనార్హం. ఇది ఏమాత్రం విజయవంతమైనా యుద్ధం ఊహకందనంత తీవ్రమయ్యేది.

ఈ ఘటనపై జెలెన్‌స్కీ మాట్లాడుతూ ‘‘నేను ఈ రోజు దాడిని చూశాను. మనం ఎలాంటి వారిని ఎదుర్కొంటున్నామో మీరు తెలుసుకోవచ్చు. ఆ దాడిలో కొందరు మరణించినట్లు తెలిసింది. మరింత సమాచారం రావాల్సి ఉంది. మేము ఆత్మరక్షణ చర్యలు చేపట్టడం అన్నిటికంటే అత్యంత కీలకం. అందుకు గగనతల రక్షణ వ్యవస్థ అవసరం’’ అని పేర్కొన్నారు. యుద్ధం కారణంగా నగరంలో జరిగిన నష్టాన్ని గ్రీకు ప్రధానికి చూపించారు. 

మరోవైపు ఈ దాడిని రష్యా రక్షణశాఖ ధ్రువీకరించింది. తాము ఒడెస్సాలోని ఓ హ్యాంగర్‌ను అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకొన్నట్లు వెల్లడించింది. అక్కడ ఉక్రెయిన్‌ దళాలు సముద్ర డ్రోన్లను సిద్ధం చేస్తున్నాయని తెలిపింది. ఈ దాడి విజయవంతమైందని పేర్కొంది. కానీ, ఈ ప్రకటనలో జెలెన్‌స్కీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని