WHO: భవిష్యత్‌ తరాలు మనల్ని క్షమించకపోవచ్చు: WHO చీఫ్‌ హెచ్చరిక

భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కొనే సంసిద్ధతపై అంతర్జాతీయంగా ఒప్పందాన్ని చేసుకోవడంలో విఫలమైతే ‘భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించక పోవచ్చు’ అని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.

Published : 23 Jan 2024 02:24 IST

జెనీవా: కరోనా (Coronavirus) మహమ్మారి నుంచి యావత్‌ ప్రపంచం కోలుకున్నప్పటికీ.. భవిష్యత్తులో ఇటువంటివి మరిన్ని వచ్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తోన్న విషయం తెలిసిందే. అటువంటివి సంభవిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే సూచించింది. భవిష్యత్తు మహమ్మారులపై సంసిద్ధతకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ప్రపంచ దేశాల నిర్లక్ష్య ధోరణిపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. అదే విఫలమైతే ‘భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చు’ అని హెచ్చరించింది.

‘ప్రపంచ దేశాలు నిబద్ధతకు అనుగుణంగా వ్యవహరించడం లేదని ఆందోళన చెందుతున్నా. సమయం తక్కువే ఉంది. పరిష్కరించుకోవాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ ఒప్పందం చేసుకోవడంలో విఫలమైతే ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే. భవిష్యత్తు  తరాలు మనల్ని క్షమించకపోవచ్చు. ఒప్పందానికి ధైర్యం కావాలి. రాజీ పడాలి. దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు అన్ని సభ్యదేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి’ అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు. జెనీవాలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఈ ఏడాది మే నాటికి మహమ్మారి ఒప్పందానికి (Pandemic Accord) సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఐరాస సాధారణ సభలో ప్రపంచ నేతలు అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు.

ట్రంప్‌ మానసికస్థితి సరిగా లేదు

భవిష్యత్తులో మహమ్మారులను నిర్మూలించడం, సంసిద్ధంగా ఉండటం, ఒకవేళ సంభవిస్తే త్వరగా ప్రతిస్పందించడంపై గతంలో చర్చ జరిగింది. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో ఓ ఒప్పందాన్ని చేసుకోవాలని డిసెంబర్‌ 2021న డబ్ల్యూహెచ్‌వో సభ్య దేశాలు నిర్ణయించాయి. ఈ ఏడాది మే 27న నిర్వహించనున్న వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ వార్షిక సమావేశంలోగా ఇది పూర్తి చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై స్పందించిన టెడ్రోస్‌.. దీనిపై ఎవ్వరూ ముందుకు రాకుంటే, మొత్తం ప్రాజెక్టు మూలనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని