కెనడాకు రాకపోకల్లో జాగ్రత్త సుమా

కెనడాలో ఉంటున్న ప్రవాస భారతీయులు, ఇక్కడి నుంచి ఆ దేశానికి వెళ్లబోతున్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.

Updated : 21 Sep 2023 05:50 IST

అక్కడ కొన్నిచోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి
ప్రజలు, ప్రవాసులు అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం
భారత్‌కు సంఘీభావంగా పలు దేశాలు
దిల్లీలో సదస్సుకు కెనడా హాజరవుతుందన్న సైన్యాధికారి

దిల్లీ: కెనడాలో ఉంటున్న ప్రవాస భారతీయులు, ఇక్కడి నుంచి ఆ దేశానికి వెళ్లబోతున్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కెనడాలో కొన్నిచోట్ల భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న దృష్ట్యా జాగ్రత్త వహించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. నిషిద్ధ ‘ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌’ (కేటీఎఫ్‌) నేత హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ కెనడాలో మూడు నెలల క్రితం హత్యకు గురికావడం వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అక్కడి పార్లమెంటులో చేసిన వ్యాఖ్య పెను దుమారం రేకెత్తించిన విషయం తెలిసిందే. ‘రాజకీయ ప్రేరేపిత విద్వేష నేరాలు కెనడాలో పెరుగుతున్నాయి. భారత వ్యతిరేక ఎజెండాతో పనిచేస్తున్నవారిని వ్యతిరేకిస్తున్న మన దౌత్యవేత్తలు, ఇతర వర్గాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగుతున్నారు. ఘర్షణలు, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలవైపు వెళ్లవద్దు. అలాంటి పరిస్థితికి ఆస్కారం ఉన్నచోట్లకు ప్రయాణాలు మానుకోవాలి. కెనడాలోని భారతీయుల భద్రత, క్షేమం కోసం కెనడా దౌత్యవర్గాలతో మన హైకమిషన్‌, కాన్సులేట్లు సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కెనడాలోని భారత పౌరులు ఒట్టావాలోని హైకమిషన్‌.. లేదా టొరంటో, వాంకోవర్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వద్ద తమ పేర్లను వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవాలి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు నేరుగా, వేగంగా సంప్రదించేందుకు తద్వారా వీలవుతుంది’’ అని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. కెనడాతో దౌత్యపరమైన సంబంధాలు, భారతీయుల పరిస్థితిపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రధాని మోదీకి నివేదించారు.  

సైనిక సహకారంపై ప్రభావం పడదు

వివాదం ప్రభావం ద్వైపాక్షిక సైనిక సహకారంపై పడబోదని సైనిక దళాల ప్రధాన కార్యాలయంలో వ్యూహాత్మక ప్రణాళిక అదనపు డైరెక్టర్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ అభినయ రాయ్‌ స్పష్టంచేశారు. ఈ నెల 26, 27 తేదీల్లో దిల్లీలో జరగబోయే భారత్‌-పసిఫిక్‌ సైనిక అధిపతుల సమావేశం (ఐపీఏసీసీ)లో కెనడా పాల్గొంటుందని చెప్పారు. సరిహద్దులో ప్రతిష్టంభన ఉన్నా చైనాతో సైనిక, దౌత్యస్థాయిలో సంబంధాలు ఉన్నట్లుగానే కెనడాతోనూ ఉంటాయన్నారు. ఇదే విషయాన్ని కెనడా సైనిక అధికారి ఒకరు కూడా తేల్చిచెప్పారు. 22 దేశాల ప్రతినిధులు దీనిలో పాలుపంచుకుంటారు. శాంతి, సుసంపన్నత, సుస్థిరతల పరిరక్షణే ధ్యేయంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం ఆ సమావేశం ఉద్దేశం.

ఖండించడానికి అమెరికా విముఖత

నిజ్జర్‌ హత్యను బహిరంగంగా ఖండించాలని అమెరికా సహా ‘ఫైవ్‌ఐస్‌ గ్రూపు’లోని కొన్ని మిత్రదేశాలను కెనడా ఇటీవల కోరినా వాటినుంచి స్పందన కరవైనట్లు ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ వెల్లడించింది. జీ20 సదస్సుకు కొద్ది వారాల ముందు ఈ కూటమి నిఘా విభాగ అధికారులతో కెనడా రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలిపింది. కూటమిలో సభ్యదేశాలుగా అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బ్రిటన్‌, కెనడా ఉన్నాయి. హత్య విషయాన్ని బహిరంగంగా లేవనెత్తేందుకు ఈ దేశాలు నిరాకరించాయి. ఈ నేపథ్యంలోనే జీ20 సదస్సులో భారత్‌ సహా మిత్రదేశాల అధినేతలతో కెనడా అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

భారత్‌తో వ్యవహారం.. నిప్పుతో చెలగాటమే

ట్రూడో ఆరోపణలను అమెరికా విదేశాంగశాఖ నిపుణులు ఖండించారు. అవి అత్యంత తీవ్రమైనవని పేర్కొన్నారు. ‘‘ఖలిస్థానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న కొంతమంది చేతుల్లో ట్రూడో కీలుబొమ్మగా మారారు. ఖలిస్థానీ నేత హత్యలోకి భారత్‌ను లాగుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. రాజకీయంగా ట్రూడోకు దీర్ఘకాలంలో ఇది లాభం కలిగిస్తుందేమో గానీ.. నాయకత్వ లక్షణం మాత్రం కాదు. ఈ వ్యవహారంలో అమెరికా నేతలు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నాం. ఎందుకంటే నిప్పుతో కెనడా చెలగాటమాడుతోంది’’ అని అమెరికన్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్‌ ఫెలో మైఖేల్‌ రూబిన్‌ మండిపడ్డారు. కెనడా చర్య ‘సిగ్గుచేటు’ అని దుయ్యబట్టారు. అమెరికాలోని అత్యధిక సిక్కుల వాణికి ఖలిస్థాన్‌ ఉద్యమం ప్రాతినిధ్యం వహించడం లేదని ‘సిక్స్‌ ఫర్‌ అమెరికా’ వ్యవస్థాపకుడు జెస్సీ సింగ్‌ చెప్పారు. భారత్‌లోని సిక్కులు ఖలిస్థాన్‌కు అనుకూలం కాదన్నారు. భారత్‌పై ఆరోపణలు ఆందోళనకరమని ఆస్ట్రేలియా పేర్కొంది. ‘భాగస్వామ్య పక్షాలతో కలిసి తాజా పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్నాం. దీనిపై ఇంతకంటే మేం మాట్లాడలేం’ అని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ ఐరాసలో విలేకరులతో అన్నారు.


ఆందోళన వెలిబుచ్చిన బ్రిటన్‌ సిక్కు ఎంపీలు

‘కెనడా వ్యాఖ్యలు ఆందోళనకరం. దీనిపై యూకే ప్రభుత్వంతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. న్యాయం జరగాలి’ అని బ్రిటన్‌ విపక్ష లేబర్‌ పార్టీ ఎంపీ తన్మన్‌జీత్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. దోషులెవరనేది కెనడా దర్యాప్తులో తేలుతుందని, తాము తమ ఆందోళనలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్తున్నామని మరికొందరు ఎంపీలు తెలిపారు. పంజాబీ కెనడా గాయకుడు శుభ్‌నీత్‌ సింగ్‌ భారత్‌లో జరపాల్సిన పర్యటన రద్దు అయినట్లు ‘బుక్‌మైషో’ బుధవారం ప్రకటించింది. టికెట్లు కొన్నవారికి పూర్తిడబ్బు వాపసు ఇస్తామని తెలిపింది. ఖలిస్థానీ సానుభూతిపరుడైన సింగ్‌ పర్యటనను బహిష్కరించాలని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పిలుపు నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు