అల్‌-షిఫా ఆసుపత్రి చుట్టూ పోరు

గాజాలోని అతి పెద్ద అల్‌-షిఫా ఆసుపత్రి కేంద్రంగా ఇజ్రాయెల్‌ దళాలకు, హమాస్‌ మిలిటెంట్లకు మధ్య భీకర పోరు సాగుతోంది.

Updated : 14 Nov 2023 07:09 IST

లోపల రోగులు, శరణార్థులు
ఇంధనంలేక చనిపోతున్న శిశువులు

ఖాన్‌ యూనిస్‌, డెయిర్‌ అల్‌-బలా, జెరూసలెం: గాజాలోని అతి పెద్ద అల్‌-షిఫా ఆసుపత్రి కేంద్రంగా ఇజ్రాయెల్‌ దళాలకు, హమాస్‌ మిలిటెంట్లకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఆసుపత్రి గేటు బయట తీవ్ర ఘర్షణ జరుగుతుండగా లోపల విద్యుత్తు సరఫరా లేక చీకట్లతో రోగులు, శరణార్థులు అల్లాడుతున్నారు. వందల మంది రోగులు, శిశువులు చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. శిశువులను, ఇతరులను తరలించేందుకు అవకాశమిస్తున్నామని ఇజ్రాయెల్‌ చెబుతున్నా అదంతా ఒట్టిదేనని గాజా ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. ఇంధనాన్నీ సరఫరా చేశామని, హమాస్‌ అడ్డుకుంటోందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. ఈ వాదనలను గాజా అధికారులు కొట్టిపారేస్తున్నారు. శనివారం నాటికి ఆసుపత్రిలోని చివరి జనరేటర్‌ పనిచేయడం మానేసింది. దీంతో ముగ్గురు శిశువులు, నలుగురు ఇతర రోగులు మరణించారు. మరో 36 మంది శిశువులు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు. శనివారం నాటికి అల్‌ షిఫా ఆసుపత్రిలో 1500 మంది రోగులున్నారు. మరో 1500 మంది వైద్య సిబ్బంది, 20వేల మంది వరకూ శరణార్థులున్నారు. ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో శరణార్థుల్లో చాలా మంది ఆదివారం ఆసుపత్రిని వీడారు. సోమవారం నాటికి 2,500 మంది మిగిలిపోయారు.

ఇజ్రాయెల్‌ సైన్యంపై హెజ్‌బొల్లా దాడులు

లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా గ్రూపు ఆదివారం జరిపిన దాడిలో ఏడుగురు ఇజ్రాయెల్‌ సైనికులు మరణించారు. 10 మంది పౌరులు గాయపడ్డారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, తదుపరి చర్యలకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ తెలిపారు. మోర్టార్‌ షెల్‌తో హెజ్‌బొల్లా దాడి చేసిందని వెల్లడించారు. ఉత్తర ఇజ్రాయెల్‌లోని మనారా ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని