కార్గిల్‌ చొరబాట్లను నేను వ్యతిరేకించా

కార్గిల్‌లో చొరబాట్లను వ్యతిరేకించినందుకే 1999లో తన ప్రభుత్వాన్ని జనరల్‌ ముషారఫ్‌ కూలదోశారని పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ తెలిపారు.

Published : 10 Dec 2023 03:24 IST

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌

లాహోర్‌: కార్గిల్‌లో చొరబాట్లను వ్యతిరేకించినందుకే 1999లో తన ప్రభుత్వాన్ని జనరల్‌ ముషారఫ్‌ కూలదోశారని పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ తెలిపారు. భారత్‌ - పాక్‌ మధ్య జరిగిన యుద్ధాల్లో కార్గిల్‌ వార్‌ ఒకటి. ఈ యుద్ధంలో పాక్‌ సేనల కుయుక్తులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టి, కార్గిల్‌ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. నాటి యుద్ధానికి అప్పటి జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కారణమని పాక్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ - (నవాజ్‌) పార్టీ అధినేత నవాజ్‌ షరీఫ్‌ అన్నారు. దేశం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులతో జరిగిన సమావేశంలో శనివారం నవాజ్‌ మాట్లాడారు. 1993, 1999.. రెండు సందర్భాల్లోనూ పదవీకాలం పూర్తి కాకముందే తనను పదవి నుంచి దించేశారని తెలిపారు. ‘‘కార్గిల్‌లో చొరబాట్లను నేను తీవ్రంగా వ్యతిరేకించా. అందుకే ముషారఫ్‌ ఎదురుతిరిగారు. వాస్తవంలో నేను చెప్పిందే నిజమైంది. నేను ప్రధానిగా ఉన్నప్పుడే భారత్‌కు చెందిన ఇద్దరు ప్రధానులు వాజ్‌పేయీ, మోదీ పాక్‌ను సందర్శించారు’’ అని నవాజ్‌ షరీఫ్‌ గుర్తు చేశారు. సరిహద్దులోని భారత్‌ సహా అఫ్గానిస్థాన్‌, ఇరాన్‌లతో సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరమని, చైనాతోనూ బలమైన మైత్రి ఉండాలని కోరుకొంటున్నట్లు నవాజ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని