మూడేళ్లు మీకు.. రెండేళ్లు మాకు!

పాకిస్థాన్‌లో సైన్యం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నవాజ్‌ షరీఫ్‌ పాకిస్థాన్‌ పగ్గాలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది.

Updated : 13 Feb 2024 06:55 IST

పాక్‌ ప్రధాని పదవిపై పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ చర్చలు
తెరపైకి బిలావల్‌ భుట్టో పేరు

లాహోర్‌: పాకిస్థాన్‌లో సైన్యం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నవాజ్‌ షరీఫ్‌ పాకిస్థాన్‌ పగ్గాలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఆదివారం షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌), బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)లు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ చర్చల్లో అధికార పంపకంపై కొన్ని కీలక ప్రతిపాదనలు ముందుకొచ్చాయని సమాచారం. తమ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీకి ప్రధాని పదవి కావాలని పీపీపీ గట్టిగా పట్టుబడినట్లు సమాచారం. ప్రధాని పదవిని మూడేళ్లు పీఎంఎల్‌-ఎన్‌, రెండేళ్లు పీపీపీ పంచుకోవాలన్న ప్రతిపాదనపైనా కసరత్తు జరుగుతోందని బిలావల్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని పగ్గాలను ఏ పార్టీ ముందు స్వీకరించాలన్న విషయంపై స్పష్టత రాలేదని తెలుస్తోంది. పీఎంఎల్‌-ఎన్‌ తరఫున నవాజ్‌ షరీఫే ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్‌-ఎన్‌కు 75 స్థానాలు దక్కాయి.

ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు సాధించారు. పీఎంఎల్‌-ఎన్‌ అధికారంలోకి రావాలంటే 54 సీట్లలో విజయం సాధించిన పీపీపీ మద్దతు తప్పనిసరి. పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ పార్టీలు కలిస్తే మొత్తం 129 సీట్లు అవుతాయి. ఆరుగురు స్వతంత్రులు కూడా ఆదివారం పార్టీలో చేరినట్లు పీఎంఎల్‌-ఎన్‌ ప్రకటించింది. 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం-పీతోనూ చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. మరోవైపు పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ ఏర్పరిచే సంకీర్ణ ప్రభుత్వంలో తాము చేరే ప్రసక్తే లేదని ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) స్పష్టం చేసింది. వారితో కూటమి కట్టే కంటే.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇష్టపడతామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని