గాజా కాల్పుల విరమణపై పీటముడి!

గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్‌ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్‌ అంటోంది.

Updated : 02 May 2024 05:57 IST

ఒప్పందం కుదిరినా యుద్ధం ముగించే ప్రసక్తే లేదు
బ్లింకెన్‌కు స్పష్టంచేసిన నెతన్యాహు
తాత్కాలిక విరమణైతే ఒప్పకోం: హమాస్‌

టెల్‌ అవీవ్‌: గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్‌ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్‌ అంటోంది. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం కైరోలో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 40 రోజుల కాల్పుల విరమణ.. హమాస్‌ చెరలోని 33 మంది బందీల విడుదల.. ప్రతిగా భారీ సంఖ్యలో పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టడం...ఇదీ ఇజ్రాయెల్‌ ప్రతిపాదన. హమాస్‌ మాత్రం తాత్కాలిక కాల్పుల విరమణకు ససేమిరా అంటోంది. పశ్చిమాసియాలో పర్యటనలో భాగంగా బుధవారం ఇజ్రాయెల్‌ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌.. ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గాజా యుద్ధాన్ని ముగించే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. శాశ్వత కాల్పుల విరమణకూ తమ దేశం అంగీకరించదన్న విషయాన్నీ ఆయన బ్లింకెన్‌కు చెప్పినట్లు సమాచారం. నెతన్యాహుతో చర్చల అనంతరం బ్లింకెన్‌ మాట్లాడారు. ఇజ్రాయెల్‌ ఉదారంగా చేసిన ప్రతిపాదనకు అంగీకారం తెలపాల్సింది హమాసేనని పేర్కొన్నారు. ‘‘వాళ్ల (హమాస్‌) ముందు ప్రతిపాదన ఉంది. ఆలస్యం చేయకుండా, సాకులు చెప్పకుండా దాన్ని వారు ఆమోదించాలి’’ అని బ్లింకెన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని