kidnap: రూ.ఐదుకోట్లు ఇవ్వకపోతే.. చిన్నారుల్ని చంపేస్తాం..!

నైజీరియా(Nigeria)లో ఇటీవల రెండు వందల మందికి పైగా చిన్నారులు అపహరణకు గురయ్యారు. వారిని విడుదల చేసేందుకు దుండగులు భారీ మొత్తం డిమాండ్ చేశారు. 

Updated : 14 Mar 2024 13:51 IST

అబుజా: నైజీరియా(Nigeria) వాయవ్య ప్రాంతంలో సాయుధ వ్యక్తులు ఓ పాఠశాల నుంచి సుమారు 287మంది విద్యార్థులను అపహరించుకుపోయి వారం రోజులు దాటింది. వారిని విడుదల చేసేందుకు ఆ దుండగులు డబ్బులు డిమాండ్ చేశారు. ఆ నగదు ఇవ్వకపోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరించారు. ఈ మేరకు స్థానికులు మీడియాకు వెల్లడించారు.

‘ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి ఆ దుండగులు ఫోన్ చేశారు. ఒక బిలియన్ నైరాలు(రూ.5.15 కోట్లు) ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిడ్నాప్‌ జరిగిన రోజు నుంచి 20 రోజుల వ్యవధిలో ఆ మొత్తం ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోతే.. అందరినీ చంపేస్తామని బెదిరించారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్‌ నౌక హైజాక్‌

గతవారం పాఠశాల కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్న తరుణంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయుధాలు ధరించి మోటారు సైకిళ్లపై వచ్చినవారు  విద్యార్థుల్ని చుట్టుముట్టి, గాల్లోకి కాల్పులు జరుపుతూ భయభ్రాంతులకు గురిచేశారు. అపహరణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని  కాల్చిచంపారు. 287 విద్యార్థుల్ని సమీప అడవుల్లోకి తీసుకుపోయారు. చిన్నారుల్లో పన్నెండేళ్లలోపు వారే కనీసం 100 మంది వరకు ఉన్నారు. నైజీరియాలో పిల్లల అపహరణ ఉదంతాలు గతంలోనూ ఉన్నా, ఇంత భారీసంఖ్యలో జరగడం కలకలం రేకెత్తిస్తోంది. అపహరణకు గురైనవారి ఆచూకీ కోసం భద్రత బలగాలు గాలిస్తున్నాయి.

2021లో ఒక ప్రైవేటు పాఠశాల నుంచి సాయుధులు 140 మంది విద్యార్థులను కిడ్నాప్‌చేశారు. వారు డిమాండ్ చేసిన మొత్తాన్ని గడువులోగా ఇవ్వకపోవడంతో ఐదుగురు విద్యార్థుల ప్రాణాలు తీసినట్లు అప్పట్లో వార్తా కథనాలు వచ్చాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని