Benjamin Netanyahu: నెతన్యాహుపై అరెస్టు వారెంట్‌.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్‌

Benjamin Netanyahu: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సహా పలువురు నేతలు, హమాస్‌ నాయకులపై అరెస్టు వారెంట్‌ జారీ చేయాలని ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కోరారు.

Published : 20 May 2024 19:10 IST

ది హేగ్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel-Hamas War)ల మధ్య గత ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధానికి ఇప్పుడప్పుడే ముగింపుపడేలా కన్పించట్లేదు. ఈ యుద్ధం కారణంగా లక్షలాది మంది పాలస్తీనీయులు నిరాశ్రయులయ్యారని ఇజ్రాయెల్‌పై ప్రపంచ దేశాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ICC)లోనూ దీనిపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కీలక అభ్యర్థనలు చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) సహా హమాస్‌, ఇజ్రాయెల్‌ నేతలకు అరెస్టు వారెంట్‌ (Arrest Warrant) జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

గాజా (Gaza) స్ట్రిప్‌లో నెతన్యాహు, ఆయన రక్షణమంత్రి యోవా గాలెంట్‌ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ఖాన్‌ ఆరోపించారు. వారి కారణంగా ఎంతోమంది అమాయక పౌరులు బాధలు అనుభవిస్తున్నారని, ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. ఈ యుద్ధంలో అనేకమంది మహిళలు, చిన్నారులు, పసికందులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.

ఇరాన్‌ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్‌ ప్రమేయం ఉందా?

అటు అక్టోబరు 7న ఇజ్రాయెల్‌ పౌరులపై పాల్పడిన నేరాలకు గానూ హమాస్‌ నేతలు యహ్యా సిన్వర్‌, మహమ్మద్‌ డెయిఫ్‌, ఇస్మాయిల్‌ హనియాపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని అభ్యర్థించారు. వీరి మెరుపు దాడులతో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని, ఎంతోమంది తమ ప్రియమైనవారిని కోల్పోయారన్నారు. ప్రాసిక్యూటర్‌ అప్లికేషన్‌పై ఐసీసీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా.. 2014 నాటి గాజా యుద్ధం కేసులో ఇజ్రాయెల్‌ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేసే అవకాశాలున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఒకవేళ ఈ వారెంట్లు జారీ అయితే, ఆ దేశ అధికారులను ఐసీసీ భాగస్వామ్య దేశాల్లో అరెస్టు చేసే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని